లెక్కతీస్తే చిక్కులే | there is no auditing in local bodies in medak district | Sakshi
Sakshi News home page

లెక్కతీస్తే చిక్కులే

Published Sun, Jan 18 2015 12:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

లెక్కతీస్తే చిక్కులే

లెక్కతీస్తే చిక్కులే

- ఆడిటింగ్ అంటేనే హడల్

లక్షలకు లక్షలు ఖర్చు చేశారు.. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలంటూ హడావుడి చేసేశారు. తీరా ఇపుడు లెక్కలు చెప్పమంటే నీళ్లు నములుతున్నారు. కనీసం రికార్డులైనా ఇవ్వమంటే...మాకాడ ఏడున్నయ్ సారూ.. ఆ పాత సర్పంచ్ తీసుకుపోయిండు అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో 2013-14 సంవత్సరానికి సంబంధించిన లోకల్ ఫండ్ ఆడిట్ జిల్లాలోని చాలా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జరగడం లేదు. ఎలాగైనా లెక్కలు తేల్చాయని సిద్ధమైన ఆడిటింగ్ అధికారులు మాత్రం చివరగా కలెక్టర్ ద్వారా నోటీసు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు.

సంగారెడ్డి: ఆడిటింగ్ అంటే చాలు స్థానిక సంస్థలు హడలి పోతున్నాయి...తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోనన్న భయంతో ఆడిటింగ్‌కు ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్‌జీఎఫ్ ఆడిటింగ్‌కు పంచాయతీలు, మండల పరిషత్‌లు సముఖంగా కనిపించటంలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు సైతం లోకల్ ఆడిటింగ్ విషయంలో బెట్టు ప్రదర్శిస్తున్నాయి. ఆడిటింగ్ అధికారులు పలుమార్లు పంచాయతీలు, మండల పరిషత్, మార్కెట్ కమిటీలకు నోటీసులు ఇచ్చినా స్పందన కనిపించడం లేదు. బీఆర్‌జీఎఫ్ నిధుల వ్యయంలో అవకతవకలు బట్టబయలవుతాయన్న గుబులుతోనే పంచాయతీలు, పలు మండల పరిషత్ కార్యాలయాలు ఆడిటింగ్‌కు ముందుకు రావటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ ఏకంగా రెండేళ్లుగా ఆడిటింగ్ పనులు ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆడిటింగ్‌కు ముందుకురాని పంచాయతీలు, మండల పరిషత్‌లపై కొరడా ఝళిపించేందుకు కలెక్టర్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

సగం పంచాయతీలు కూడా లెక్కజెప్పలే
కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వ్యయానికి సంబంధించి జిల్లా స్థాయిలో లోకల్ ఫండ్ ఆడిట్ అధికారులు ఏటా పంచాయతీలు, మండల పరిషత్, మున్సిపాలిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఆడిటింగ్ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం 2013-14 సంవత్సరానికి  అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,066 పంచాయతీలకుగాను ఇప్పటి వరకు 685 పంచాయతీల్లో ఆడిటింగ్ పనులు పూర్తయ్యాయి. 46 మండల పరిషత్‌లకుగాను 37 మండల పరిషత్‌లో ఆడిటింగ్ జరిగింది. 17 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా వీటిలో కేవలం ఒకే ఒక్క మార్కెట్ కమిటీలో ఆడిటింగ్ జరిగింది. జిల్లాలో ఇంకా 381 పంచాయతీలు, 9 మండల పరిషత్, 16 మార్కెట్ కమిటీల్లో ఆడిటింగ్ జరగాల్సి ఉంది. ఆడిటింగ్ నిర్వహణ కోసం పంచాయతీలు, మండల పరిషత్, మార్కెట్ కమిటీలపై ఆడిటింగ్ శాఖ అధికారులు ప్రస్తుతం ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అయితే గత సర్పంచ్‌లు రికార్డులు అప్పగించకపోవటం, పంచాయతీ కార్యదర్శులు చాలాచోట్ల ఇన్‌చార్జిలుగా వ్యవహరించటం వల్లే ఆడిటింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు.

అతీగతీ లేని బీఆర్‌జీఎఫ్ ఆడిట్
బీఆర్‌జీఎఫ్ ఆడిటింగ్‌ సైతం ఆశించినస్థాయిలో సాగటం లేదు. జిల్లాలోని 220 పంచాయతీలు, మూడు మండల పరిషత్‌లలో బీఆర్‌జీఎఫ్ నిధుల వ్యయానికి సంబంధించి ఆడిట్ పనులు ప్రారంభం కాలేదు. కల్హేర్, మిర్‌దొడ్డి, మునిపల్లి మండల పరిషత్‌లలో బీఆర్‌జీఎఫ్ ఆడిట్ జరగలేదు. అలాగే నారాయణఖేడ్ మండలంలో 25 పంచాయతీలు, కౌడిపల్లి మండలంలో 18 పంచాయతీలు, కల్హేర్‌లో 15, జహీరాబాద్‌లో 14, పుల్కల్, శివ్వంపేట మండలాల్లో పది పంచాయతీల చొప్పున ఆడిటింగ్ జరగలేదు. రాయికోడ్, కంగ్టి, కొండపాక, పాపన్నపేట, పటాన్‌చెరు మండలాల్లో ఐదు నుంచి పది పంచాయతీల్లో బీఆర్‌జీఎఫ్‌కు సంబంధించిన ఆడిటింగ్ పెండింగ్‌లో ఉంది. బీఆర్‌జీఎఫ్ నిధులకు సంబంధించి చాలాచోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే లెక్కలు చెప్పేందుకు పంచాయతీలు, మండల పరిషత్ అధికారులు ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. పూర్తిస్థాయి ఆడిటింగ్ జరిగితే తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందేమోనన్న భయంతోనే పంచాయతీ, మండల పరిషత్ యంత్రాంగం ఆడిటింగ్‌కు ముందుకు రావటంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
కలెక్టర్ ద్వారా వత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం
ఆడిటింగ్‌కు ముందుకురాని పంచాయతీలు, మండల పరిషత్, వ్యవసాయ మార్కెట్ కమిటీలను దారిలోకి తెచ్చేందుకు ఆడిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా  కలెక్టర్ ద్వారా పంచాయతీలు, మండల పరిషత్ అధికారులకు నోటీసులు పంపేందుకు సమాయత్తమవుతున్నారు. ఆడిటింగ్ చేయించని పంచాయతీల జాబితాను సిద్ధం చేశామని, ఈ జాబితాను త్వరలో కలెక్టర్‌కు అందజేయనున్నట్లు లోకల్ ఫండ్ జిల్లా ఆడిటింగ్ అధికారి విజయ్‌కుమార్ సాక్షికి తెలిపారు. ఆడిటింగ్ పూర్తి చేసుకోని పంచాయతీలకు నోటీసులు జారీ చేసి నిధుల వ్యయంపై లెక్కలేస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement