దృష్టి మరల్చి చోరీలు.. | Thief arrested | Sakshi
Sakshi News home page

దృష్టి మరల్చి చోరీలు..

Published Thu, Mar 24 2016 6:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Thief arrested

పంజగుట్ట(హైదరాబాద్ సిటీ): ఏటీఎం సెంటర్ వద్ద కాపుకాసి... డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్టు నటించి.. వారి ఏటీఎం కార్డు మార్చేసి డబ్బు డ్రా చేసుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా వెల్ధుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.సిద్దేశ్ (25) ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులు చేసేవాడు. గ్రామంలో ఒకసారి ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం మిషీన్ ఆపరేటింగ్ రాక తికమకపడుతుంటే సిద్దేశ్ అతనికి సాయం చేశాడు. ఇద్దరి ఏటీఎం కార్డులు ఒకే బ్యాంక్‌వి కావడంతో డబ్బులు డ్రా చేసే సమయంలో మారిపోయాయి. సిద్దేశ్ అకౌంట్ లో కేవలం రూ. 3 వేలు ఉండగా... గుర్తుతెలియని వ్యక్తి అకౌంట్‌లో రూ. 40 వేలు ఉన్నాయి.

ఆ కార్డు పిన్ నెంబర్ తెలియడంతో సిద్దేశ్ ఆ డబ్బు డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తరహా మోసాలు మొదలెట్టాడు. ఇదే కేసులో గతంలో కర్నూలులో అరెస్టై జైలుకెళ్లాడు. నగరానికి మకాం మార్చి... జైలు నుంచి బయటకు వచ్చాక తన మకాం నగరానికి మార్చాడు. ఎర్రగడ్డలో స్నేహితుడు లక్షీ్ష్మకాతం ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావు తన కొడుకును కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం నిమ్స్‌లో చేర్పించాడు. ఫిబ్రవరి 3న నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించగా రాలేదు. అప్పటికే అక్కడ కాపుకాసిన సిద్దేశ్ తాను సాయం చేస్తానని కార్డు తీసుకుని, ఏటీఎం పిన్ తెలుసుకున్నాడు.

నాగేశ్వర్‌రావు దృష్టి మరల్చి అతని ఏటీఎం కార్డుకు బదులు అదే బ్యాంక్‌కు చెందిన మరో కార్డు అతడి చేతిలో పెట్టి.. ఈ ఏటీఎంలో నగదు లేదు, వేరే ఏటీఎంకు వెళ్లి డ్రా చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత నాగేశ్వర్‌రావు కార్డుతో సోమాజిగూడలోని మరో ఏటీఎం నుంచి రూ.22 వేలు డ్రా చేశాడు. ఆ మరుసటి రోజే సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న నాగలక్ష్మి కార్డును కూడా ఇదే విధంగా మార్చేసి రూ. 30 వేలు డ్రా చేశాడు. ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేస్తే టాక్స్ పడుతుందని.... ఫిబ్రవరి 17న ఎస్సార్ నగర్ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు ప్రేమ్‌నగర్‌కు చెందిన బి.సూర్యనారాయణ అనే కూలీ రూ. 50 వేలు ఆన్‌లైన్ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన స్నేహితుడి అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న సిద్దేశ్ ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. నీ అకౌంట్‌లో ఉన్న నగదు పోతుంది. నా అకౌంట్‌లో నగదు ఉంది. అకౌంట్ టు అకౌంట్ మారిస్తే ట్యాక్స్ పడదు’’ అని నమ్మబలికాడు. దీంతో సూర్యనారాయణ తన వద్ద ఉన్న రూ. 50 వేలు సిద్దేశ్‌కు ఇచ్చాడు. సిద్దేశ్ తన బ్యాంక్ ఏటీఎం కార్డును మిషీన్‌లో పెట్టి మినీ స్టేట్‌మెంట్ తీసి దానిని సూర్యనారాయణకు ఇచ్చి నగదు ట్రాన్స్‌ఫర్ అయిపోయిందని నమ్మబలికాడు.

చదువు రాని సూర్యనారాయణ నిజమే అనుకుని వెళ్లిపోయి.. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి వాకబు చేయగా డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సూర్యనారాయణ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టివేత... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. బుధవారం రాజీవ్‌నగర్ ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా... ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 77 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్‌పై కర్నూలులో 3, గుత్తిలో 2, పంజగుట్టలో 2, ఎస్సార్ నగర్‌లో 1 మెత్తం 8 కేసులు ఉన్నాయని, ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సార్ నగర్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్, డీఐ షేక్ జిలానీ, ఎస్సై శ్రీనివాస్ నిందితున్ని గుర్తించిన హోంగార్డు తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement