తెలంగాణలోకి ఆ నాలుగు పంచాయతీలు..!
భద్రాచలం నుంచి ఏపీకి వెళ్లిన గ్రామాలపై కేంద్రం కసరత్తు
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ అంశాన్ని ప్రవేశపెట్టే అవకాశం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోలవరం ముంపులో భాగంగా ఏపీలోకి వెళ్లిన భద్రాచలం మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వస్థాయిలో చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ఆమోదం, పునర్విభజన చట్టాన్ని సవరించడంతోనే కేంద్రం ఈ చర్యకు పూనుకోనుంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలసి దీనిపై చర్చ జరిపారు. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ గ్రామాలు మళ్లీ తెలంగాణ లోకే వస్తాయన్నారు. దీంతో ఈ ప్రాంతవాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
భద్రాచలాన్ని మినహాయించి దానికి ఆనుకుని ఉన్న ఏటపాక, కన్నాయిగూడె ం, పురుషోత్తపట్నం, పిచుకలపాడు పంచాయతీలు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో విలీనమయ్యాయి. భద్రాచలం నుంచి తెలంగాణలోనే ఉన్న దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలంటే ఏపీలో విలీనమైన ఈ గ్రామాల మీదుగానే ప్రయాణించాల్సి ఉంది. భద్రాచలం రామాలయానికి సుమారు 900 ఎకరాల భూమి, ఏపీలో విలీనమైన పురుషోత్తపట్నం పరిధిలోనే ఉండటంతో ఈ ప్రాంతాన్ని తెలంగాణకు కల పాలనే వాదన బలపడింది. ఆ నాలుగు పంచాయతీల్లో 17 రెవెన్యూ గ్రామాలు, సుమారు 12 వేల జనాభా, 10 వేల ఎకరాల భూమి ఉంది.
చరిత్రాత్మకమైన ఉష్ణగుండాలున్న గుండాల పంచాయతీని తెలంగాణలోనే కలపాలనేవాదన ఇటీవల ఊపందుకుంది. ఈ పంచాయతీలు భద్రాచలం సమీపాన ఉండడంతో నిత్యం ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ఏపీలో కలపడంతో ప్రధానంగా రెవెన్యూ, ఇతర పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల అంగీ కారంతోనే తదుపరి చర్య ప్రారంభమవుతుందని కేంద్రం ప్రకటిస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలపై కేంద్రం ముందుకు కదలకపోవడంతో ఒకింత నిరాశగా ఉన్న ఈ ప్రాంత ప్రజలు.. సీఎం కేసీఆర్ ఈ గ్రామాలపై ప్రకటన చేసిన నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
పునర్విభజన చట్ట సవరణతో లింకు
ఈ గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలంటే పునర్విభజన చట్ట సవరణకు కేంద్రం లింకుపెడుతోంది. విభజన చట్టంలో ఉన్న పలు అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రతిసారి రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడిచినా.. చర్చలతోనే వీటిపై కేంద్రం సరిపెడుతున్నా ముందడుగు మాత్రం వేయ డం లేదు. కేంద్ర మంత్రులు చేసే ప్రకటనలు ఓవైపు ఊరటనిస్తున్నా.. సీఎం కేసీఆర్ స్వయంగా జిల్లా పర్యటనలో వీటిపై ప్రకటన చేసినా ఈ గ్రామాలు తెలంగాణలో ఎప్పటికి వీలనమవుతాయనే ప్రశ్నకు సమాధానం లేదు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఈ గ్రామాల విలీన అంశాన్ని ప్రవేశపెడుతుందని సీఎం ప్రకటించడం తో బడ్జెట్ సమావేశాల కోసం ఈ ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.