ఢిల్లీ: వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని.. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారమే ప్రకటించారు స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. డ్యూ డేట్ కంటే ఐదురోజులు ముందుగానే ఇలా ఉభయ సభలు వాయిదా పడడం ఇదే ఏడోసారి. మిగిలిన ఐదురోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి.
షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగష్టు 12వ తేదీవరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలి. ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. లోక్‌సభ పదహారు రోజులు మాత్రమే సమావేశం అయ్యిందని, ఏడు చట్టాలకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటలకంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మేజర్ హైలెట్స్
► ధరల పెంపుపై విపక్షాల నిరసనలు.. నిత్యం నిరసన గళాలతో నినాదాలు
► సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ఆవరణలో ఉంటూ నిరసన
► రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. వాటి ఫలితాలు
► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ సభల్లో బీజేపీ ఆందోళనతో హోరెత్తించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
► పలు కీలక బిల్లులపై ఆమోదం
► టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను.. ధరల చర్చ జరుగుతున్న టైంలో టేబుల్ కింద దాయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్.
► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య పట్ల పార్లమెంట్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment