
టీడీపీలో చేరిన తోట త్రిమూర్తులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మారీచుడిని మించిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధ వారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు తన నివాసంలో మాట్లాడారు. కేసీఆర్ వ్యవసాయం చేస్తూ ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
తూర్పు గోదావరి జిల్లాలో రైతులు వ్యవసాయం చేయటంలో మంచి పేరు గడించారని, అలాంటి వారే సాగు లాభసాటి కాదని గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తే... నీళ్లు కూడా దొరకని మెట్ట ప్రాంతంలో ఎకరాకు కోటి సంపాదిస్తున్నానని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హైద రాబాద్‌లాంటి నగరాలను సీమాంధ్రలో నిర్మిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనలో అనుసరించిన విధానం వల్ల కాంగ్రెస్ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో భూస్థాపితమైందని, దాన్ని లేవకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించే సత్తా చంద్రబాబుకే ఉందని త్రిమూర్తులు చెప్పారు.