సాక్షిప్రతినిధి, సూర్యాపేట: వారికి అనువంశికంగా వచ్చిన భూములవి. ఈ భూములను గత ఏడాది దళితులకు భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆ కుటుంబాలు ముందుకొచ్చాయి. ఎంతో ఔదార్యంతో ఆ కుటుంబాలు ముందుకొచ్చినా అక్కడ ఉన్న భూ మాఫియా.. ‘ఈ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దు.. పదికో, పరక్కో మాకే ఇవ్వాలి’ అంటూ ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
సూర్యాపేట జిల్లా చింతపాలెం మండలం వెల్లటూరులో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. జిల్లాలోని హుజూర్‌నగర్‌కు చెందిన అమరవాది రవిచందర్, అమరవాది గోపాలకృష్ణమూర్తి, అమరవాది చంద్రమౌళీశ్వర ప్రసాద్‌తో పాటు మరో పదిమంది బ్రాహ్మణ కుటుంబాలకు చింతపాలెం మండలం వెల్లటూరు గ్రామంలో భూములున్నాయి. ఈ గ్రామంలోని సర్వే నంబర్ 488 లో అనువంశికంగా వచ్చిన సుమారు 135 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిలో 70 ఎకరాలను ఆ 13 కుటుంబాలు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం కింద ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాయి. వెంటనే స్పందించిన కలెక్టర్, సదరు దరఖాస్తులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలంటూ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. భూ రికార్డులను పరిశీలించి వివరాలు పంపాలని జేసీ, చింతపాలెం తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఆ భూముల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులు తేల్చలేదు.
పదికో.. పరకో మాకే అమ్మాలి!
ఈ భూములను బ్రాహ్మణ కుటుంబాలు ప్రభుత్వానికి ఇస్తున్నాయని తెలుసుకున్న స్థానిక భూ మాఫియా వీరిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆ భూమిని తమకే పదికో.. పరకో అమ్మాలని బెదిరింపులకు పాల్పడుతోంది. మూడు రోజుల క్రితం ఆ భూములను పరిశీలించేందుకు జేసీ వెళ్లారు.
భూములు తమ అ«ధీనంలో ఉన్నాయని, తమకు కొందరు అమ్మారంటూ భూ మాఫియా జేసీ ముందు వాదించింది. జేసీ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బ్రాహ్మణ కుటుంబాలను భూ మాఫియా సభ్యులు భయభ్రాంతులకు గురిచేయడంతో వారు దీనిపై కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
పట్టించుకోని స్థానిక రెవెన్యూ సిబ్బంది ..
ప్రభుత్వానికి ఇస్తామన్న భూమిపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రైతుబంధు పథకం కింద ఇటీవల ఈ భూములకు సంబంధించి కొత్త పట్టేదారు పాస్ పుస్తకాలు కూడా సదరు బ్రాహ్మణ కుటుంబాల్లో కొందరికి వచ్చాయి.
మిగతావి తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నా యి. ‘ప్రభుత్వానికి ఇస్తే ధర తక్కువగా వస్తుందని, ఎంతకో కొంతకు భూ మాఫియా సభ్యులకే అమ్మండి’ అంటూ స్థానిక రెవెన్యూ యంత్రాంగం వారికి వత్తాసు పలుకుతోందని బ్రాహ్మణ కుటుం బాలు ఆరోపిస్తున్నాయి.
మళ్లీ సీఎంవో మెట్లెక్కిన బాధితులు
ఈ భూముల విషయమై తమను భయాందోళనకు గురిచేస్తున్నారంటూ ఆ బ్రాహ్మణ కుటుంబాలు శుక్రవారం సీఎంవోను ఆశ్రయించాయి. స్థానిక రెవెన్యూ సిబ్బంది భూ మాఫియాతో చేతులు కలిపి ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని సీఎంఓ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. తమ భూములవైపు వెళ్తే భూ మాఫియా తమను హత్య చేయాలని చూస్తోందని, తమకు రక్షణ లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాకు న్యాయం చేయాలి..
ఈ భూములను దళితుల భూ పంపిణీ పథకానికి ఇవ్వడానికి ముందుకొస్తే భూ మాఫియా సభ్యులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవి మావి కావడంతోనే కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయి. మిగతావి రెండో విడతలో ఇస్తామంటున్నారు. మాకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. – అమరవాది రవిచందర్, హుజూర్‌నగర్
మా భూములని వీళ్లు, వాళ్లు అంటున్నారు..
బ్రాహ్మణ కుటుం బాలు వెల్లటూరులోని వారి భూములను దళితుల భూ పంపిణీ పథకానికి ఇస్తామని దరఖాస్తు చేసింది వాస్తవమే. ఆ భూముల పరిశీలనకు జాయింట్ కలెక్టర్ వచ్చారు. అయితే ఆ భూములు తమవంటే.. తమవని బ్రాహ్మణ కుటుంబాలు, గ్రామస్తులు అంటున్నారు. ఈ భూముల విషయాన్ని పరిశీలిస్తున్నాం. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు బ్రాహ్మణ కుటుంబాలకు వచ్చాయి. – జె.కార్తీక్, తహసీల్దార్, చింతపాలెం మండలం
Comments
Please login to add a commentAdd a comment