నత్తనడకన భూపంపిణీ | Land distribution slowly | Sakshi
Sakshi News home page

నత్తనడకన భూపంపిణీ

Published Wed, Nov 4 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

నత్తనడకన భూపంపిణీ

నత్తనడకన భూపంపిణీ

7 నెలల్లో ఇచ్చింది కేవలం 663 మందికే
అధికారుల మధ్య సమన్వయ లేమితో కుంటుతున్న పథకం
వచ్చే మార్చి కల్లా మరో   5 వేల ఎకరాల పంపిణీ లక్ష్యం
ఇలాగైతే లక్ష్యం చేరిది గగనమే..

 
హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు భూ పంపిణీ పథకం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న తీరుగా సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు ముగిసిపోయినా పథకం అమలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య మొత్తం 663 లబ్ధిదారులకు 1,822 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారు. వచ్చే మార్చిలోగా (ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా) మరో 5 వేల ఎకరాలను పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.. దాన్ని చేరుకునే దాఖలాలు కనిపించడం లేదు. పథకాన్ని మరింత మెరుగ్గా చేపట్టేందుకు రెవెన్యూ శాఖతో మరింత సమన్వయం పెంచుకోవాలని, జిల్లాల్లో జేసీలు మొదలుకుని, ఆర్డీవోలు, ఎమ్మార్వోలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని భావించినా అది ఆచరణకు నోచుకోవడం లేదు. జిల్లాల్లోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల(ఈడీ) ఆఫీసుల్లో ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను డిప్యుటేషన్‌పై నియమించి, భూపంపిణీ పనులను వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకున్నా అవీ అమలు కావడం లేదు. పథకం అమలుకు రెవెన్యూ శాఖపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తుండడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,462 మందికి 3,936 ఎకరాల మేర మాత్రమే భూమిని పంపిణీ చేయగలిగారు. అందులో 1,203 మందికి 3,274 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినా.. 946 మందికి మాత్రమే ల్యాండ్ రికార్డులు పంపిణీ చేశారు.

ఈ ఏడాది తీరిది!
రాష్ట్రంలో 9 జిల్లాల్లో గత ఏడు నెలల్లో మొత్తం 663 లబ్ధిదారులకు 1,822 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరం కూడా పంపిణీ చేయలేదు. ఇక హైదరాబాద్‌కు పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాల్లో భూములకు అధిక రేట్లు, కోర్టు కేసులు, వివాదాలు ఉండడంతో కేవలం ఆరుగురికి 17 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇక నల్లగొండ జిల్లాలో 30 మందికి 66 ఎకరాలు, నిజామాబాద్‌లో 45 మందికి 116 ఎకరాలు, కరీంనగర్‌లో 63 మందికి 183 ఎకరాలు, వరంగల్‌లో 79 మందికి 221 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 111 మందికి 320 ఎకరాలు, మెదక్‌లో 118 మందికి 277 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 211 మందికి 621 ఎకరాలు ఇచ్చారు. ఈ పథకాన్ని ప్రారంభించిన కిందటేడాది ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు భూమి అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోలేదు. మెదక్, వరంగల్, ఆదిలాబాద్ మినహా మిగతా జిల్లాల్లో భూమిలో అవసరమైన సౌకర్యాలు, పంట వేసుకునేందుకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలను చేపట్టలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement