పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే.. మూడు రోజుల పాటు నగరం విడిచి వెళ్లరాదని పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.నాగిరెడ్డి గురువారం సూచించారు.
హైదరాబాద్: q తమ సిబ్బంది పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లిన సమయంలో కొందరు ఉండడం లేదని, దీంతో విచారణ పెండింగ్‌లో పడుతోందన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగరవాసులు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుని మరుసటి రోజే నగరం విడిచి వెళ్తున్నారని, ఇలాంటి వారు మూడు రోజులు ఇంటి వద్దగానీ, నగరంలోగానీ ఉంటే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేసేందుకు వీలు కలుగుతుందని అన్నారు. పాస్‌పోర్ట్ క్లియరెన్స్ ఒక్కోసారి 24 గంటల్లోనే పూర్తవుతోందని, కొన్ని సందర్భాల్లో మూడు రోజులకు మించడం లేదని చెప్పారు. ప్రస్తుతం నగరంలో పాస్‌పోర్ట్ దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు.
ఎఫ్‌వీవోలకు నెలకు 30 లీటర్ల పెట్రోల్..
స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్(ఎఫ్‌వీవోలు) సొంత బైక్‌పై వెళ్లి పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ చేపట్టేవారు. వారికి పోలీసులకు ఇచ్చే విధంగానే నెలకు పెట్రోల్ అలవెన్స్ కింద ప్రభుత్వం రూ.200 ఇచ్చేది. చాలీచాలని అలవెన్స్‌లు ఇవ్వడంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుడి నుంచి ఎంతో కొంత డబ్బు ఆశించేవారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకోవద్దని ఆదేశించారు. అయితే విధి నిర్వహణలో బైక్‌పై తిరిగితే ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.200 సరిపోదని తెలుసుకున్న ఉన్నతాధికారులు.. వారికి నెలకు 30 లీటర్ల పెట్రోల్ ఇచ్చేందుకు నిర్ణయించారు. మార్చి నుంచి ఈ అలవెన్స్‌లు ఇస్తున్నారు. కాగా, త్వరలో స్పెషల్ బ్రాంచ్‌కు తొలి విడతలో 44 కొత్త బైక్‌లు రానున్నాయి. వీటిని బాగా పనిచేసిన వారికి ఇచ్చేందుకు ఎఫ్‌వీవోల గ్రేడింగ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.