షేక్ సుభానీ, షేక్ షర్మిళ, హైదర్ ఫిర్దోస్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: పచ్చని కుటుంబంలో ఊహించని ప్రమాదం పెను విషాదం రేపింది. గ్యాస్ సిలిండర్ మృత్యుపాశంగా మారి చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలంటుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా, మదిర గ్రామానికి చెందిన షేక్ సుభానీ(32), షేక్ షర్మిళ (25) దంపతులు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి సూరారం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి షేక్ హైదర్ ఫిర్దోస్(3) కుమార్తె. ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో సుభానీ సిలిండర్ మార్చాడు. 6వ తేదీ ఉదయం అతను సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుభానీతో పాటు అతడి భార్య షర్మిళ, కుమార్తె ఫిర్దౌస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 12న సుభాని, షర్మిళ మృతి చెందగా, చిన్నారి ఫిర్దోస్ బుధవారం కన్నుమూసింది.
Comments
Please login to add a commentAdd a comment