ముగ్గురిని బలిగొన్న ప్రమాదం | three members died on rama krishnapuram flyover in road accident | Sakshi
Sakshi News home page

ముగ్గురిని బలిగొన్న ప్రమాదం

Published Thu, Nov 6 2014 1:41 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రామకృష్ణాపురం ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం....

నేరేడ్‌మెట్: రామకృష్ణాపురం ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.నేరేడ్‌మెట్ ఎస్‌ఐ ప్రవీణ్‌బాబు కథనం ప్రకారం..... నెల్లూరు జిల్లా కొండాపుం మండలం, సాయిపేట గ్రామానికి చెందిన అజయ్ (25), అదే జిల్లా కొడవలూరు మండలం, గుండలమ్మపాలెం గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్ (18) ఓల్డ్ సఫిల్‌గూడ పూలపల్లి బాలయ్య కాలనీలో అద్దెకుంటున్నారు.

ఇద్దరూ బ్యాచిలర్స్. అజయ్ మేస్త్రీ పని చేస్తుండగా, సహాయకుడిగా వెంకటేశ్ పని చేస్తున్నాడు. కాగా బుధవారం ఉదయం ఎర్రగడ్డలో పని నిమిత్తం ఇద్దరూ కలిసి బైక్ (ఏపీ 29 ఏవై 7216)పై వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, షేక్‌పేట గాంధీనగర్‌కు చెందిన రాము నేరేడ్‌మెట్‌లోని యమహా షోరూంలో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్ (16) రాముకు మిత్రుడు. ప్రణయ్‌కు చెందిన బైక్ (ఏపీ 3072) సర్వీసింగ్ చేసేందుకు బుధవారం ఉదయం ఇద్దరూ కలిసి బైక్‌పై నేరేడ్‌మెట్‌లోని యమహా షారూమ్‌కు బయలుదేరారు.

వీరిద్దరూ రామకృష్ణాపురం ఫ్లైవర్‌పైకి రాగానే వెనుకనుంచి అతివేగంగా వచ్చిన జీహెచ్‌ఎంసీకి చెందిన టిప్పర్ ( ఏపీ 12 డబ్ల్యూ1298) బలంగా ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న ప్రణయ్ చెత్త వాహనం కిందపడిపోగా.. వెనుక కూర్చున్న రాము పక్కన పడ్డాడు. ప్రణయ్ పైనుంచి టిప్పర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న అజయ్, వెంకటేష్‌ల బైక్‌ను వీరి యమహా బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ కిందపడ్డారు.

తలకు తీవ్రగాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ప్రణయ్, స్వల్పగాయాలకు గురైన రామును స్థానికులు  గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణయ్ మృతి చెందగా... రాము కోలుకున్నాడు.  నేరేడ్‌మెట్ పోలీసులు అజయ్, వెంకటే శ్‌ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అదుపులోకి తీసుకొని, టిప్పర్‌ను, మృతుల ద్విచక్రవాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు  కేసు దర్యాప్తులో ఉంది.

 ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జాం...  
 రామకృష్ణాపురం బ్రిడ్జిపై ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.  కార్యాలయాలకు, కళాశాలలకు వెళ్లే వారి వాహనాలతో బ్రిడ్జిపై నుంచి నేరేడ్‌మెట్ చౌరస్తా వరకు  సుమారు గంట సేపు ట్రాఫిక్ జాం అయింది.  బ్రిడ్జి వెడల్పు తక్కువగా, రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement