మూడు పార్టీలకూ పరీక్షగా మారిన సభ్యత్వ నమోదు
ఓటమి నుంచి తేరుకోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ శ్రేణులు
సగానికి కూడా చేరుకోని లక్ష్యాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి తేరుకోని పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదుకు ఉత్సాహం చూపకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేకపోవడం గమనార్హం.
ఆయా పార్టీల సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి మొక్కుబడిగా హాజరవుతున్నారన్న వి మర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌పార్టీ వచ్చే ఏడాది మార్చిలోగా రెండు లక్షల క్రియాశీల సభ్యత్వా లు నమోదు చేయించాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు కనాకష్టంగా 60 వేల సభ్యత్వాలునమోదు చేయించి చతికిల పడింది. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఫలితం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.
ఎన్నికలకు ముందు గ్రూపు రాజకీయాలతో సతమతమైన కాంగ్రెస్.. ఘోరపరాభవంతో గుణపాఠం నేర్చుకుంది. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమష్టిగా నడుంబిగించింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన జిల్లాకు చెందిన నేతలు ఆ తర్వాత సభ్యత్వ నమోదుకు ఊపు తీసుకురావడంలో విఫలమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదుపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. ఎన్నికలకు ముందు గ్రూపు రాజకీయాలతో సతమతమైన సీనియర్లు ఓటమితో గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కలిసికట్టుగా ముందుకు సాగుతున్నప్పటికీ దిగువశ్రేణి నేతలను ఏకతాటిమీదకు తేలేకపోతున్నారు. ఈ ప్రభావం సభ్యత్వంపై పడుతోంది.
‘దేశం’లోనూ అదే తీరు..
ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినా.. అనంతరం జరిగిన పరిణామాలతో కుదేలైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చతికిలపడింది. జిల్లాలో రెండు లక్షల మందిక్రియాశీల కార్యకర్తలతో సభ్యత్వ నమోదు చేయించాలని టార్గెట్‌గా పెట్టుకున్న తెలుగుతమ్ముళ్లు.. లక్ష్యంలో సగానికి కూడా చేరుకోలేకపోయారు. గురువారం నాటికి గడువు ముగిసినా లక్ష్యం చేరకపోవడంతో గడువును వారం రోజులపాటు పొడిగించారు.
ఎన్నికల అనంతరం పలువురు ముఖ్య నేతలు అధికారపార్టీ గూటికి చేరడంతో టీడీపీలో నైరాశ్యం అలుముకుంది. ఉన్న కొద్దిపాటి నేతలు కూడా ఊగిసలాడుతుండడంతో సభ్యత్వ నమోదు ఊపందుకోలేదు. తాండూరు, మహేశ్వరం, ఎల్‌బీ నగర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీకి సారథ్యం వహించే నేతలు లేకపోవడం.. ఉన్న నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పొడచూపడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
కమలంలోనూ నైరాశ్యమే..
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల సభ్యత్వాలు చేయించాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటివరకు రెండు లక్షలు కూడా దాటలేకపోయింది. నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జీలను నియమించినా ఫలితంలేకుండా పోతోంది. పార్టీకి ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తున్నా.. దాన్ని ప్రోది చేసుకోవడంలో విఫలమవుతోంది.
సభ్యత్వం.. ఆరంభశూరత్వం!
Published Thu, Dec 18 2014 11:49 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement