మూడేళ్లలో మిగులు విద్యుత్
- విద్యుత్‌శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి
- ‘టెరి’ యూనివర్సిటీ ప్రాంగణానికి శంకుస్థాపన
- 40 ఎకరాల్లో ఏర్పాటు కానున్న క్యాంపస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుం దని విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఢిల్లీకి చెందిన ‘ ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం’ హైదరాబాద్ క్యాంపస్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు, టెరి వర్సిటీ చాన్స్‌లర్ ఆర్.కె. పచౌరీ, వైస్ చాన్స్‌లర్ లీనా శ్రీవాస్తవ, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇంధన ఉత్పాదక, అభివృద్ధి రంగంలో పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టెరి యూనివర్సిటీ తమ ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. యూనివర్సిటీ ప్రాంగణం అభివృద్ధికి సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న టెరి యూనివర్సిటీ హైదరాబాద్ నగరానికి అద్భుతమైన వరంగా మార నుందన్నారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు టెరి వర్సిటీ పరిశోధనలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించి సోలార్, విండ్ పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వర్సిటీ చాన్స్‌లర్ పచౌరీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్ష మెగావాట్ల విద్యుత్ (సౌర, పవన)ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ఇదే జరిగితే ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. వైస్‌చాన్స్‌లర్ లీనా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రపంచ అవసరాలకు తగిన రీతిలో మానవ వనరులను అభివృద్ధి చేసేం దుకు టెరి యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు.