
సమావేశంలో పార్టీ శ్రేణులు బహూకరించిన విల్లును ఎక్కుపెడుతున్న కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేసి పశ్చిమ రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని అన్నారు. స్థానిక ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారిన 111 జీఓపై అధ్యయనం చేయడానికి కమిటీని వేశామని, భవిష్యత్‌లో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సవ్యమైన పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని, ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పబోడని భరోసా ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక ఫరా కళాశాల మైదానంలో జరిగిన ఈ సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నా.. అంతకుమించి కూడా ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ఇక్కడి ప్రజల ఆకాంక్షని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లో కలిపేందుకు కృషిచేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. రాజేద్రనగర్ బుద్వేల్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ రాబోతుందని కేటీఆర్ వెల్లడించారు. అధిక భాగం స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో స్థానికులకు ఉపాధి లభించేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. పరిశ్రమలు రావాలంటే భూములపై పంచాయతీలు చేయొద్దని, అలాగైతేనే అధిక సంఖ్యలో పరిశ్రమల స్థాపన జరుగుతుందని వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా పరిశ్రమలు వచ్చేలా చూస్తానని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దెబ్బకు.. కాంగ్రెస్‌కు దడ పుట్టిందని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ నేతలకు చురకలు
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కేటీర్ పార్టీ శ్రేణులకు ఒక వైపు మార్గ నిర్దేశనం చేస్తూనే.. మరో వైపు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్ల అన్ని చోట్ల అభ్యర్థులు గెలువగా.. కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఓటమి ఎదురైందని నేతలను సూటిగా ప్రశ్నించారు. తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఎందుకు వెనకబడ్డామో ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చురకలు అంటించారు. వికారాబాద్‌లో స్వల్ప మెజారిటీతోనే ఎలా గెలిచామని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ను అడిగారు. నాయకులు ఎప్పటికప్పుడు తమలోని పొరపాట్లను సవరించుకోకపోతే పురోగతి ఉండదన్నారు. నేల విడిచి సాము చేయొద్దని నాయకులకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ అని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అని గర్వంతో దేశమంతా తిరుగుతా అంటే కుదరదని, తొలుత బూత్‌స్థాయి, ఆ తర్వాత గ్రామస్థాయిలో మెజారిటీ రాకుంటే పరువుపోతుందని హితవు పలికారు.
ఎమ్మెల్యే అయినా, కార్పొరేషన్ చైర్మన్ అయినా బూత్ స్థాయిలో 70 శాతం ఓట్లు తీసుకొని రావాలన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో నాయకులు.. ప్రతి కార్యకర్తను కలుసుకోవాలని సూచించారు. బూత్, గ్రామాల వారీగా తిరిగేందుకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోవాలన్నారు. గెలిచినా, ఓడినా అందరూ మనవారేనని, పాత పంచాయతీలను పక్కనబెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తమవైపే చూస్తున్నారని.. ఇటువంటి వారిని పార్టీలోకి పెద్ద మనసుతో సాదరంగా ఆహ్వానించాలని చెప్పారు. వ్యక్తిగత ద్వేషాలకు స్వస్తి పలికి కేసీఆర్ కోసం అందరికీ దగ్గర కావాలని వినయంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి సీహెచ్.మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, మహేశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బాల్క సుమన్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంటీ టికెట్ దాదాపు ఖరారైన పారిశ్రామికవేత్త జి.రంజిత్‌రెడ్డి కూడా వేదికపై ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment