
ఇంట్లోకి దూసుకెళ్ళిన టిప్పర్
చండ్రుగొండ (ఖమ్మం జిల్లా) : ఓపెన్ కాస్టుకు వెళుతున్న ఓ టిప్పర్ ప్రమాదవశాత్తు ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా చండ్రుగొండిలో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కొత్తగూడెం నుండి సత్తుపల్లి సింగరేణి ఓపెన్‌కాస్టుకు వెళ్తున్న టిప్పర్ వేగంగా వెళ్తూ అదుపు తప్పింది.
రోడ్డుపక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి నల్లమోతు మాధవరావు ఇంట్లోకి దూసుకెళ్లింది. దాంతో ఆ పెంకుటిల్లు ధ్వంసం అయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సత్తుపల్లి- కొత్తగూడెం మధ్య నడుస్తున్న బొగ్గుటిప్పర్లు అతివేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతుండటంతో మండల ప్రజలు వణికిపోతున్నారు.