
తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆత్మకూరు నాగేశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి ఆత్మకూరు నాగేశ్ సోమవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నాగేశ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయుడైన నాగేశ్ తెలంగాణ జన సమితి ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్‌తో పాటు సంగారెడ్డి టికెట్ ఆశించిన నాగేశ్.. మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో పక్షం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరడం టీజేఎస్ వర్గాల్లో సంచలనం కలిగించింది.
టీజేఎస్ వర్గాల్లో నిరాశ
కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీతో పాటు, టీజేఎస్ ఆవిర్భావం నుంచి ఇతర జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా పరి«ధిలో పలు కార్యక్రమాలు జరిగాయి. టీఆర్‌ఎస్‌తో పాటు వివిధ సంఘాల్లో చురుగ్గా పనిచేసిన పలువురు నేతలు టీజేఎస్ ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరారు. సంగారెడ్డి నుంచి బీరయ్య యాదవ్, ఆత్మకూరు నాగేశ్, జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి ఆశప్ప తదితరులు టికెట్ ఆశించారు. మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీజేఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట స్థానాలను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజేఎస్ ఆశిస్తున్న స్థానాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. బీసీ కోటాలో ఏదో ఒక స్థానం నుంచి తనకు పోటీ అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో నాగేశ్ చేరిక నేపథ్యంలో పార్టీలోని మిగతా శ్రేణుల ప్రస్థానం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment