నా వెంటే ఉండాలి! | To be one of my favorites! | Sakshi
Sakshi News home page

నా వెంటే ఉండాలి!

Published Mon, Sep 1 2014 3:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

To be one of my favorites!

  •  ‘స్టేషన్’పై డిప్యూటీ సీఎం రాజయ్య గురి    
  •  సొంత సెగ్మెంట్‌లో పట్టు పెంచుకునే వ్యూహం
  •  టీఆర్‌ఎస్ మండల కమిటీల రద్దుకు కారణమిదే...
  •  కొత్త రాజకీయూనికి తెరతీసిన తాటికొండ
  •  ఎంపీ కడియం శ్రీహరి వర్గమే లక్ష్యంగా పావులు
  • సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తాటికొండ రాజయ్య... సొంత నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజకీయం గా పట్టు పెంచుకోవడంపై దృష్టి పెట్టా రు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గం లేకుండా చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.  ప్రత్యర్థి వర్గంలోని వారు తన వెంట వచ్చేలా ప్రయత్నించడం, కుదరకపోతే వారిని పూర్తిగా దూరం పెట్టడం... అనే రెండు మార్గాల్లో రాజయ్య ముందుకు సాగుతున్నారు. 1999 నుంచి తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండి ఇటీవలి ఎన్నికల ముందు నుంచి ఒకే పార్టీలో పనిచేస్తున్న కడియం శ్రీహరి వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు.

    స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని తన చేతిలోకి తీసుకునే పనిలో పడ్డారు. మొదట నియోజకవర్గంలోని ఐదు మండలాల టీఆర్‌ఎస్ పార్టీ కమిటీలను రద్దు చేయించారు. ఐదు మండలాలకు కొత్తగా కన్వీనర్లను నియమించారు. పూర్తిగా తనకు అనుచరవర్గంగా ఉండే వారికి ఈ పదవులు ఇచ్చారు. త్వరలో ఏర్పాటు చేయనున్న మండల పార్టీ కమిటీలు, నియోజకవర్గ పరిధిలోని మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ పదవుల్లోనూ తన వెంట నడిచే వారికే ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు ప్రారంభించారు.

    రాజయ్య రాజకీయాన్ని గ్రహించిన టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది ఇప్పటికే కడియం శ్రీహరిని వదిలి ఈయన దగ్గరికి వచ్చారు. మిగిలిన కొద్ది మందిని సైతం దారిలోకి తెచ్చుకునేందుకు రాజయ్య ఇప్పుడు కమిటీల రద్దు నిర్ణయాన్ని అమలు చేశారు.
     
    భవిష్యత్ వ్యూహంతో...
     
    2014 ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టి.రాజయ్య టీఆర్‌ఎస్ టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌లో చేరిన కడియం శ్రీహరి సైతం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన చేయడంతో గులాబీ దళంలో రెండు వర్గాల మధ్య విభేదాలు పొడచూపారుు. ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయాలనే విషయంలో కిందిస్థాయి కార్యకర్తలు ఏకంగా ఘర్షణకు దిగిన పరిస్థితులు ఉన్నాయి. చివరకు కడియం శ్రీహరి ఎంపీగా, రాజయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

    తర్వాత ఎంపీపీ ఎన్నికల్లోనూ వర్గ రాజకీయం కొనసాగింది. ఉప ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవిలో ఉండి సొంత నియోజకవర్గంలో వర్గాలు ఉండడం ఎప్పటికైనా ఇబ్బందే అని గ్రహించిన రాజయ్య... ‘పోటీ’ రాజకీయాలకు ఇప్పుడే ముగింపు పలికే పనిలో పడ్డారు. కేవలం తన బలాన్ని పెంచుకోవడం ఒక్కటే అయితే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నికల ముందు సస్పెన్షన్ వేటు పడిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

    ఇదే సమయంలో తన ప్రత్యర్థి వర్గంలో ఎవరూ లేకుండా చేస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల రాజయ్య హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో భేటీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో రాజయ్య... ‘టీఆర్‌ఎస్‌లో నాకు మంచి గుర్తింపు వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి గెలిచిన వారికి ఇంతకంటే పెద్ద పదవి రాదు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరికీ తక్కువ చేయలేదు. ఇప్పుడు నియోజకవర్గానికి నేనే బాధ్యుడిని. ఎటు ఉంటారో మీరే తేల్చుకోండి. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు కచ్చితంగా ఉంటుంది’ అని ఉద్బోధించారు.  
     
    కడియం వర్గానికి చెక్
     
    స్టేషన్‌ఘన్‌పూర్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన వ్యక్తి కడియం వర్గంలో ఉండేవారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. రాజయ్య అనుచరుడిని కన్వీనర్‌గా నియమించారు. జఫర్‌గఢ్ మండలాధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఎన్నికలకు ముందు కడియం ఎమ్మెల్యే కావాలని ప్రచారం చేశారు. తీగారంలో ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

    ఈయనను తొలగించి రాజయ్య అనుచరుడిని కన్వీనర్‌గా నియమించారు. ధర్మసాగర్ మండలంలో పార్టీ శ్రేణులతో సత్సం బంధాలు నెరిపే నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో అధ్యక్షుడిని మార్చినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల్లో తనకు దూరంగా ఉండే వారిని పక్కనబెట్టి తన అనుచరులకు కన్వీనర్ పదవులు ఇచ్చినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నారుు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement