సాక్షి, ఖమ్మం : జిల్లాలో వైద్య, వ్యవసాయ సమస్యలు ఎప్పటికీ అపరిషృ్కతంగానే ఉంటున్నాయని, వీటిపై జిల్లా అధికారుల తీరుమారాలని సోమవారం జరిగిన జడ్పీ తొలి సర్వసభ్య సమావేశంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు అన్నారు. ప్రధానంగా వైద్య రంగం మంచం పట్టిందని, దీనికి ట్రీట్‌మెంట్ చేయాలని కలెక్టర్‌కు చెప్పారు.
వైద్య రంగం విఫలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ
కొత్తగూడెం మండలం పెనగడప గ్రామమంతా జ్వరాలతో మంచం పట్టింది. ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. ఆదివారం రాత్రి జ్వరంతో పరిస్థితి విషమించి గ్రామానికి చెందిన ముగ్గురిని వైద్యం కోసం ఖమ్మం తీసుకొచ్చారు. కొన్ని రోజులుగా ఈ గ్రామంలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఈ విషయాన్ని వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఒక్క గ్రామంలో ముగ్గురు చనిపోయి.. అక్కడ జ్వరాలను కంట్రోల్ చేయకపోతే జిల్లా అంతా ఎలా చేస్తారో డీఎంహెచ్‌ఓ చెప్పాలి. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. వైద్యం పరంగా జిల్లాలో విఫలమయ్యారు. ఒక్క గ్రామంలో పరిస్థితి ఇలా ఉంటే జిల్లా అంతటా ఇక ఏరకంగా వైద్యం అందుతుందో అర్థమవుతోంది. ఇప్పటికైనా ఏజెన్సీలో వైద్య రంగాన్ని కలెక్టర్ గాడిలో పెట్టాలి.
ప్రతిపక్షాలకు ఫ్రాధాన్యత ఇవ్వాలి
మల్లు భట్టివిక్రమార్క, మధిర ఎమ్మెల్యే
జడ్పీ వేదికగా చేసే జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికల్లో ప్రతిపక్షాలకు చోటు కల్పించాలి. ప్రతిపక్షాల పాత్ర లేకుండా ప్రణాళికలు ఎలా చేస్తారు..? . జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. భద్రాచలానికి చెందిన డాక్టరే డెంగ్యూతో మృతి చెందాడు. డెంగ్యూ లేదని డీఎంహెచ్‌లో ఎలా చెబుతారు..? జిల్లాలో పాలన ఉందా..?.
వైద్య రంగానికే అనారోగ్యం
పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే
జిల్లాలో వైద్య రంగానికి పూర్తిగా అనారోగ్యం సోకింది. ప్రైవేట్ ఆస్పత్రులు డెంగ్యూ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యాధికారులు తయారు చేస్తున్న రిపోర్టుల కన్నా ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూను నమోదు చేయలేదు. దీంతో నిరుపేదలు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. డెంగ్యూ టెస్టు పరికరాలను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చే యాలి. అలాగే జిల్లాను వణికిస్తున్న డెంగ్యూను ఇకనైనా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద చేర్చాలి. జిల్లా కేంద్రం నుంచి మన్యం వరకు వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రి అపరిశుభ్రతకు ఆనవాళ్లు గా మిగిలింది. జిల్లా అంతటిని కరువు జిల్లాగా ప్రకటించాలి.
ఏజెన్సీలో మెరుగైన వైద్యం అందాలి
తాటి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే
విష జ్వరాలతో బాధపడుతున్న ఏజెన్సీ గిరజనులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి. ఏజెన్సీలో ఖాళీగా డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. గ్రామాల్లో డ్రైనేజీల వ్యవస్థ సరిగా లేక మురుగునీరుతో గ్రామాలు అధ్వానంగా మారాయి. పంచాయతీలకు నిధులు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మారుమూల ఏజెన్సీ గూడేల్లో వైద్యం అందడం లేదు. ఇటీవల వచ్చిన వరదలతో విషజ్వరాలు విజృంభించాయి. పల్లెల్లోని పీహెచ్‌సీల్లో 24గంటలు వైద్యం గిరిజనులకు అందుబాటులో ఉండాలి. అస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తగినన్నీ నిధులను ప్రభుత్వ నూతన తెలంగాణలో ప్రభుత్వం గిరిజనులకు మంచి వైద్యం అందించాలి.
అధికారులు సమస్యలపై దృష్టి పెట్టాలి
బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ
నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. జిల్లాలో ఏసమస్య వచ్చినా అధికారులు వాటిపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు దక్కాలి. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం ఎన్నో నూతన మార్పులు తీసుకొస్తోంది. ప్రజలు ఆశతో ఎన్నుకున్న ప్రభుత్వం వారి ఆకాంక్షలు నెరవేర్చుతోంది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. రాజకీయాలకతీంగా అన్ని పార్టీలు జిల్లా సమగ్రాభివృద్ధికి ముందుకు రావాలి. జడ్పీవేదిక చేసే పనులన్నీ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. సంక్షేమ పథకాల ఫలాలన్నీ పేదలకు అందడమే బంగారు తెలంగాణ ఉద్దేశం.
చెరువులను ప్రభుత్వం పునరుద్ధ్దరిస్తోంది..
బాణోతు మదన్‌లాల్, వైరా ఎమ్మెల్యే
కాకతీయుల కాలం నాటికి చెరువులను జిల్లాలోఅభివృద్ధి చేసి ఆయకట్టును పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రుణ మాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కొణిజర్ల, వైరాలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేశారు. దీనిపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించి, వారికి రుణ మాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. వైరా రిజర్వాయర్ ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందుతోంది. అయితే రిజర్వాయర్ నీటి నిలువ రెండు టీఎంసీలు పెంచితే చివరి ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉండదు.
అర్హులకు రుణ మాఫీ చేయాలి
మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ చైర్మన్
జిల్లాలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించేలా జిల్లా అధికారులు నివేదిక పంపాలి. ప్రత్యేకంగా జిల్లాలో 1/70 చట్టంతో రుణ మాఫీ విషయంలో గిరిజన రైతులు ఆందోళన ఉన్నారని వారికి న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. సహకార సొసైటీల్లో యూరియా బ్లాక్‌లో అమ్మితే తమ దృష్టికి తీసుకరావాలి.
తీరు మారాలి
Published Tue, Sep 30 2014 2:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement