కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం
టీఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి సుధాకర్‌రావు
కొడకండ్ల : పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పనిచేయాలంటే తమకు సందేహాలు ఉన్నాయని పాలకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి డాక్టర్ సుధాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి చాలా సంవత్సరాల నుంచి నాయకులు, కార్యకర్తలు శ్రమించారని, అలాంటి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నందున తమ సందేహాలు నివృత్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో గురువారం వడ్డెకొత్తపల్లిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ అనంతరం సుధాకర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఎర్రబెల్లితో తమకు గత చేదు అనుభవాలున్నాయని, 2009లో జరిగిన ఎన్నికల్లో ఎర్రబెల్లిని గెలిపిస్తే తన అనుచరులను పూర్తిగా విస్మరించి అన్యాయం చేశాడని, ప్రభుత్వం లేనప్పుడే ఎర్రబెల్లి కక్ష సాధింపుకు పాల్పడ్డాడని అన్నారు. బంగారు తెలంగాణ సారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె సీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులంతా సమావేశానికి హాజరయ్యూరని, కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ సాధనకు కృషి చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోరుునా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిత్యం అందుబాటులో ఉంటున్నానని, ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు.
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దయాకర్‌కు 36 వేల ఓట్ల మేజారిటీని అందించామన్నారు. ఎర్రబెల్లిని చేర్చుకోవడం ముఖ్యమంత్రి ఇష్టమే అయినా ఎర్రబెల్లిని ప్రశ్నించే హక్కు తమకున్నదని సుధాకర్‌రావు అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు బాకి లలిత, జాటోత్ కమలాకర్, బానోత్ జ్యోతి, కర్నె సోమయ్య, మండలాల పార్టీ అధ్యక్షులు యాదగిరిరావు, రాంబాబు, రమేష్, కుమార్, నర్సింహనాయక్, గాంధీనాయక్‌తో పాటు ముఖ్య నాయకులు, 42 మంది సర్పంచ్‌లు, 39 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఎర్రబెల్లితో కలిసి పనిచేయాలంటే...
Published Fri, Feb 12 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement