దక్షిణాది విడిది... ప్రకృతినిధి | Today is the arrival of President Ramnath Kovind in hyderbad | Sakshi
Sakshi News home page

దక్షిణాది విడిది... ప్రకృతినిధి

Published Fri, Dec 21 2018 1:49 AM | Last Updated on Fri, Dec 21 2018 1:49 AM

Today is the arrival of President Ramnath Kovind in hyderbad - Sakshi

సాక్షి , హైదరాబాద్‌: నగరంలోని బొల్లారంలో  ఉన్న రాష్ట్రపతి నిలయం ప్రకృతికి ఆలవాలం. పచ్చని పరిసరాలు, ఔషధ, పూల మొక్కలతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారు తోంది ఈ నిలయం. 158 వసంతాలు పూర్తి చేసు కున్న ఈ భవన నిర్మాణం, దాని చుట్టూ అల్లుకున్న చరిత్ర అపురూపం. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిదికి హైదరాబాద్‌ రానున్న దృష్ట్యా  ఈ నిలయం విశేషాలపై ‘సాక్షి’ కథనం...

తండ్రి శంకుస్థాపన.. కొడుకు చేతులు మీదుగా ప్రారంభం
ఆసిఫ్‌జాహీ వంశీయుల నాలుగో పాలకుడు  నిజాం నజీర్‌–ఉద్‌–దౌలా ఈ భవన నిర్మాణానికి  1856లో శంకుస్థాపన చేశారు. అయితే ఇతను 1857లో మరణించారు. ఇతడి కుమారుడు ఐదవ నిజాం అఫ్జల్‌–ఉద్‌–దౌలా తండ్రి ప్రారంభించిన భవనాన్ని 1860లో పూర్తి చేయించాడు. ఇలా 158 ఏళ్లకు పూర్వం నిజాం పాలకులు కట్టించిన భవనం ఇది. దీన్ని ఐదవ నిజాం నవాబులు తమ విశ్రాంతి భవనంగా వాడుకున్నారు. ఈ ప్యాలెస్‌ చుట్టూ 50 అడుగుల ప్రహరీ  నిర్మించారు. వీటితోపాటు కంద కాలు తవ్వించారు. ఎంతదూరంలో ఉన్న శత్రువు నైనా గుర్తించడానికి వీలుగా  నిర్మాణాలు చేపట్టారు.
దేశంలో మొత్తం 3 చోట్ల: రాష్ట్రపతికి దేశం మొత్తం మీద 3 భవనాలు ఉన్నాయి. ఒకటి దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌. ఆయన ఉత్తరాదికే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడున్న ప్రజల సాధదక బాధకాలు తెలుసుకునేం దుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విడిది భవనాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఒకటి, దక్షిణాది వారికోసం బొల్లారం విడిది గృహం ఏర్పడింది. ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి ఇక్కడికి వస్తారు. వారం నుంచి 2 వారాలు ఉంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేసవిలో  సిమ్లాలో ఉంటారు. 

25 వేల చదరపు గజాల్లోనే భవనం 
98 ఎకరాల విస్తీర్ణంతో ఉండే రాష్ట్రపతి నిలయంలో మధ్యలో రాష్ట్రపతి భవనం, చుట్టూ పచ్చని తోట లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.  మొత్తం వైశాల్యం లో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలోనేభవనం ఉంది. మిగతా స్థలంలో రకరకాల ఔషధ మొక్కలు, పూల తోటలు ఉన్నాయి. ఇవి సుమారుగా 7,000 చ.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. వాటిలో సర్పగంధ, కాల బంధ, సిట్రొన్నా, నిమ్మ గడ్డి, ఖుస్, జెరానియం, కొత్తిమీర, గంధపు చెట్టు, గడ్డ దినుసు, జాస్మిన్, కల్మేఘ్, తులసి మొదలైనవి. ఈ తోటను తెలంగాణ మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌ నిర్మించింది. 

ఈ భవనం మూడు భాగాల్లో ఉంది
ప్రెసిడెంట్‌ వింగ్, ఫ్యామిలీ వింగ్‌ లేదా సెంట్రల్‌ వింగ్‌ , ఏడీసీ వింగ్‌. ఈ 3 విభాగాల్లో కలిసి మొత్తం 20 గదులున్నాయి.  వేర్వేరుగా ఉన్నా వీటిని కలుపు తూ అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ ఉంది. ఈ 3 వింగ్‌లకు వేరుగా వంటశాలలు ఉన్నాయి. ఈ అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ ఒక వంటశాల దగ్గర మొదలై ఇంకో వింగ్‌లో ఉన్న డైనింగ్‌ హాల్‌ దగ్గర ఆగుతుంది. ఈ సొరంగంలోకి బాగా వెలుతురు వచ్చే విధంగా  భూమి వైపు కిటికీలు అమర్చారు. బయటి నుంచి చూస్తే అండర్‌గ్రౌండ్‌ కనబడుతుంది.బ్రిటిష్‌ వారి అధీనంలోకి వచ్చాక ఈ మార్గాన్ని నిర్మించారు. 
అతిథులకు అన్ని సౌకర్యాలు: రాష్ట్రపతితో పాటు, ఆయన కుటుంబీకులు ఉండేందుకు. భద్రతా సిబ్బంది. ప్రెసిడెంట్‌ వింగ్‌లో సినిమా హాల్‌ దర్బార్‌ హాల్, 25 మంది ఒకేసారి భోజనం  చేసేలా భోజనశాల, అతిథి గదులు ఇలా అన్ని  వసతులు ఉన్నాయి. భవన నిర్మాణమంతా యూరోపియన్‌ శైలిలో ఉంటుంది.  

బ్రిటిష్‌ సైన్యం నుంచి... మన రాష్ట్రపతి నిలయంగా..
1803లో ఆసిఫ్‌ జాహీ వంశీయుల మూడో పాలకుడి పట్టాభిషేకం చేశారు. అనంతరం 1806లో ప్రస్తుతం ఉన్న కంటోన్మెంట్‌ ఏరియాలో బ్రిటిష్‌ వారు తమ సైన్యం బస చేయడానికి అనుమతులు పొందారు. బొల్లారంలో బ్రిటిష్‌ సైనికులకు క్వార్టర్లు కట్టించారు. దానికి దగ్గరలో ఉన్న ఈ భవనంపై బ్రిటిష్‌ వాళ్ల కన్ను పడింది. అలా బ్రిటిష్‌ సైన్యాధికారి  కార్యాలయంగా మారింది. దీంతో ఇది  బ్రిటిష్‌ రెసిడెన్సీగా మారింది. ఈ భవన స్థలంలో సైనికులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950లో ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 60 లక్షలకు  ఖరీదు చేసింది. మరమ్మతులు చేయించి రాష్ట్రపతికి శీతాకాల విడిదిగా మార్చారు. తొలిసారిగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 1953 జనవరి నెలలో ఈ భవనంలో బస చేశారు. ఈ నిలయంలో ఒక దేవాలయం కూడా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement