
నేటినుంచి ‘ఆసరా’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు తదితరులు 3,62,166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,53,265 దరఖాస్తులు ఎస్‌కేఎస్ ద్వారా అప్‌లోడ్ అయ్యాయి. ఎంపీడీఓల వెబ్‌సైట్‌లలో కనిపిస్తున్నవి 1,92,585 కాగా.. అందరికీ పింఛన్లు అందించాలని నిర్ణయించారు. వీరికి నవంబర్, డిసెంబర్‌ల పెన్షన్ అందించనున్నారు.
వీటికి సంబంధించి రూ. 40.52 కోట్లు ఇప్పటికే ఎంపీడీఓల ఖాతాల్లో జమయ్యాయి. పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ రొనాల్డ్ రోస్ మంగళవారం రాత్రి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు నిర్వహించారు. పంపిణీ ప్రక్రియకు అధికారులను సమాయత్తం చేశారు. ప్రారంభ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
కొనసాగుతున్న ఆన్‌లైన్ ప్రక్రియ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహార భద్రత, సామాజిక పింఛన్లు తదితర దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వేగంగా సాగింది. సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 15 వరకే అవకాశమని చెప్పినా.. 20వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు.
విచారణ, సర్వే కోసం వెళ్లిన సందర్భంలోనూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డులకోసం 7,25,723, ఆసరా పింఛన్ల కోసం 3,85,210, కుల ధ్రువీకరణ పత్రాలకోసం 1,12,011, ఆదాయం ధ్రువీకరణ కోసం 1,00,531, నేటివిటీ సర్టిఫికెట్లకోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. సర్వే కోసం వెళ్తున్న బృందాలకు అక్కడక్కడా రాజకీయ ఒత్తిళ్లు, అడ్డంకులు ఎదురైనా... సకాలంలో విచారణను పూర్తి చేసినట్లు ప్రకటించారు. సర్వే కారణంగా పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరిగింది.
ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి సర్కారు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వివరాల నమోదు సందర్భంలో జరిగిన తప్పిదాలు తలనొప్పిగా మారాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక ఇబ్బందికరంగా మారగా.. సుమారు 40 వేల దరఖాస్తులపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఇంకొంత మంది లబ్ధిదారుల కోసం ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
కొందరికి మోదం.. ఇంకొందరికి ఖేదం
రెండు నెలలుగా పింఛన్లు రాక ఆందోళన చెందుతున్నవారు.. మొదటి విడత జాబితాలో తమ పేరు ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ జాబితాలో పేరు లేని వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో జిల్లాలో 2,79,816 మందికి పెన్షన్లు అందేవి. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 1,52,563, వితంతు 74,612, వికలాంగ 29,634, చేనేత 1,143, గీతకార్మిక పెన్షన్లు 761 ఉండేవి. అభయహస్తం కింద మరో 21,103 మందికి పింఛన్‌లు పంపిణీ చేసేవారు.
రెండు నెలల క్రితం వరకు వీరికి పెన్షన్ డబ్బులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచి, లబ్ధిదారుల జాబితాను వడపోయాలని నిర్ణయించి తిరిగి దరఖాస్తులు స్వీకరించింది. 3,62,166 మంది దరఖాస్తు చేసుకోసం వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో 87,231 పెన్షన్లు తగ్గాయి.
అయితే అధికారులు మాత్రం పింఛన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆగిపోలేదని, నిరంతరం కొనసాగుతుందని పేర్కొం టున్నారు. అర్హులైన వారికి తప్పకుండా పింఛ న్ అందుతుందంటున్నారు. కాగా 1,92,585 మంది కోసం మంగళవారం రాత్రి వరకు 1.70 లక్షల పింఛన్ కార్డులను ముద్రించిన అధికారులు.. బుధవారం వాటిని కూడా పంపిణీ చేయనున్నారు.