అసెంబ్లీకిది బ్లాక్ డే
ఏపీ సర్కారుకు రేవంత్ సమర్థనా?
కేసీఆర్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో సోమవారం వాడీవేడి చర్చ సాగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య శాసనసభలో వాగ్యుద్ధం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని ముఖ్యమంత్రి ఆరోపిస్తే, ప్రభుత్వం తన అసమర ్థతను పొరుగు రాష్ట్రంపై వేసి తప్పించుకోవాలని చూస్తోందని రేవంత్ ప్రతి విమర్శలకు దిగడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాల మేరకు వాస్తవ వాటా కన్నా ఎక్కువగానే విద్యుత్‌ను రాష్ర్టం వాడుకుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సహా అధికారపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఓ దశలో సీఎం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, మాతృభూమిని అవమాన పరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇది బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రేవంత్ వెనక్కి తగ్గకపోగా.. ‘నన్ను రెచ్చగొట్టినా, దూషించినా దారి తప్పనంటూ’ తన పంథాలో మరోమారు మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర వాదులాటకు దారితీసింది. చివరికి శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు తగ్గించరాదంటూ ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రాావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గతంలో హైకోర్టులో దాఖలు చేసిన ‘పిల్’ కారణమని వ్యాఖ్యానించడంతో గొడవ మరింత ముదిరింది. సోమవారం విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో చేసిన ప్రకటనపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సమాధానం, ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పందన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నాలుగు నెలలుగా కోరినా స్పందించని ప్రభుత్వం.. 400 మంది రైతుల ఆత్మహత్యల అనంతరమైనా స్పందించినందుకు అభినందిస్తున్నానంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 1956 నుంచి 1993 మధ్య రాష్ట్రంలో 5,634 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉండగా.. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అదనంగా 5,061 మెగావాట్ల సామర్థ్యంగల కొత్త ప్లాంట్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. దీనిపై అధికారపక్షం ఎమ్మెల్యేలు కొంత అభ్యంతరం చెప్పగా.. ‘దొరను సంతోషపెట్టడానికి నాకు అడ్డుపడొద్దు’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించడం సభలో వేడి పుట్టించింది. బాబు హయాంలో తెలంగాణలోని 20 లక్షల పంప్‌సెట్లకు 9 గంటల కరెంట్ ఇచ్చారని, విభజన చట్టం ప్రకారం అప్పులు, ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచినా, విద్యుత్ విషయంలో మాత్రం వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని 46:54 నిష్పత్తిలో పంచారని, కేవలం తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే అధికంగా విద్యుత్ ఇచ్చేందుకు బాబు సహకరించారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మరింత దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపైఒకరు గట్టిగా అరుచుకోవడం తో గందరగోళం నెలకొంది. రేవంత్ వ్యాఖ్యలపై సీఎం ప్రతిస్పందించడంతో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలైంది. చివరికిది సభ వాయిదాకు దారితీసింది. ఈ వాగ్వాదం ఇలా సాగింది.
సీఎం: నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రమే ఆరోపణలు చేశాను. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు?
రేవంత్: అక్కడ ఫ్యూజులు పీకుతారు, ఇక్కడ బస్సు యాత్రలు చేస్తున్నారని అన్నారు కదా..! ఇది ఆరోపణ కాదా?
కేసీఆర్: బాబు ఫ్యూజులు పీకింది వాస్తవం కాదా? మీరు బస్సు యాత్రలు చేసింది వాస్తవం కాదా?
రేవంత్: విద్యుత్ సంస్థల్లో అధికారులను సరిగా నియమించుకోలేని అసమర్థ ప్రభుత్వం ఇది.
కేసీఆర్: ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలవుతోంది. నేను స్వయంగా 50 ఉత్తరాలు రాశాను. వర్క్ టూ ఆర్డర్ కింద 35 మంది ఐఏఎస్‌లతో ప్రభుత్వం నడుస్తోంది. ఒక్కో అధికారి మూడు శాఖలు చూస్తున్నారు. ఈ విషయంలో అధికారులను అభినందించాలి. రాష్ట్ర సీఎస్ 15సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినా కేటాయింపులు జరగలేదు. అది అసమర్థత కాదు, జాప్యం మాత్రమే. అసమర్థత అనుకుంటే అది మీ అవివేకం.
రేవంత్: సదరన్ డిస్పాచ్ సెంటర్ లెక్కల ప్రకారం నిర్ణీత వాటా కంటే తెలంగాణ ఎక్కువగానే వాడుకుంది. (గణాంకాలు చెబుతున్న సమయంలో టీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు)
కేసీఆర్: అసెంబ్లీకి ఇదొక బ్లాక్ డే. ఈ సభ్యుడు మాతృభూమిని అవమానించే రీతిలో మాట్లాడుతున్నాడు. ఏపీ మనకు చేస్తున్న మోసాన్ని సమర్థిస్తావా?, ఇదొక వాదనా? అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. దీనికి అధికారపక్ష సభ్యులు సైతం ‘సిగ్గు..సిగ్గు’ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది.
(ఈ గొడవ మధ్య మంత్రి హరీశ్‌రావు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతిచ్చారు.)
హరీశ్‌రావు: కార్గిల్ యుద్ధ సమయంలో పార్టీలు, మతాలకు అతీతంగా అంతా భారత ప్రభుత్వం వెనకాల నిలిచింది. కావేరీ జలాల విషయంలో తమిళనాడులో రజనీకాంత్ నుంచి రిక్షా కార్మికుడి వరకు ప్రభుత్వానికి అండగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా టీడీపీ సభ్యులు మాత్రం పక్క రాష్ట్రం నేతకు అండగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ప్రజల పక్షాన నిలవాల్సింది పోయి పక్క రాష్ట్రానికి వంతపాడుతారా? పవర్ తీసుకెళ్లినా, గవర్నర్ పాలన పెట్టాలని కోరినా.. టీడీపీ నేతలు స్పందించారా?
రేవంత్: నన్ను రెచ్చగొట్టినా, దూషించినా దారి తప్పను. రైతుల ఆత్మహత్యలకు కారణాన్ని పక్క రాష్ట్రంపై వేయాలనుకోవడం తప్పు. సెంట్రల్ పూల్ నుంచి రావాల్సిన విద్యుత్‌లోనూ తెలంగాణకే అధికంగా వచ్చింది.
సీఎం: (కోపంగా) రాష్ట్ర సమస్యలు తెలిసీ పక్కరాష్ట్రాన్ని సమర్థిస్తారా? ఇది చరిత్రకు మంచిది కాదు. రేవంత్ చేస్తున్న వాదన నూరు శాతం తప్పు. ఒక్క మాట నిజం కాదు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? ఇంత దుర్మార్గమా?... ఇదే సమయంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు ‘తెలంగాణ ద్రోహులారా ఖబడ్దార్’ అంటూ నినాదాలు చేశారు.
రేవంత్ స్పందిస్తూ.. తనకు ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి, మంత్రే ఎక్కువ సేపు మాట్లాడారంటూనే.. మొత్తం విద్యుత్‌లో తెలంగాణకు 271 మిలియన్ యూనిట్ల మేర ఎక్కువ విద్యుత్ వస్తుందని వివరించబోయారు. రేవంత్ మళ్లీ అదే అంశంపై మాట్లాడుతుండటంతో స్పీకర్ మైక్ కట్ చేసి బీజేపీకి అవకాశమిచ్చారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనతో మరోమారు రేవంత్‌కు అవకాశం కల్పించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా కోర్టు నుంచి స్టే తెచ్చి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ అనడంతో సభలో దుమారం రేగింది. దీంతో సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు.