భీమ్..సలామ్ | Today is the anniversary of komuram Bheem | Sakshi
Sakshi News home page

భీమ్..సలామ్

Published Wed, Oct 8 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

భీమ్..సలామ్

భీమ్..సలామ్

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమరభేరి మోగించిన ధైర్యశాలి కొమురం భీమ్. నిరక్షరాస్యుడు అయినా నిజాం అరాచకాలు, పోకడలను గ్రహించి ఆగ్రహించిన మేధాశాలి. అడుగడుగునా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించాడు. జల్.. జంగల్.. జమీన్.. (నీరు, అడవి, భూమి)పై హక్కుల కోసం పోరాటం చేశాడు. తానొక్కడే కాక దట్టమైన అడవిలో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గిరిజనులను ఏకం చేశాడు.

ఆయుధాలు సమకూర్చుకుని గెరిల్లా దాడులతో పోరాటం చేశాడు. చివరకు కెరమెరి మండలం జోడేఘాట్ గుట్టల్లో నిజాం సర్కారు తుపాకీ తూటాలకు నేలకొరిగాడు. అయినా ఇప్పటికీ గిరిజనుల గుండెల్లో కొలువై ఉన్నాడు. వారి ఆరాధ్య దైవమయ్యాడు. నేడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.     

చిన్నతనం నుంచే తిరుగుబాటు
భీమ్ స్వగ్రామం ఆసిఫాబాద్ మండలం సంకెపల్లి. తన చిన్నతనంలో భీమ్ సోదరులు అటవీ శాఖ సిబ్బందితో పడుతున్న గొడవలకు కారణాలను తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో అక్కడి సమకాలీక సమస్యలు, కారణాలపై అవగాహన పెంపొందించుకున్నాడు. భీమ్ మరణించే నాటికి ఉన్న తీరును బట్టి 1910-15 మధ్య జన్మించి ఉంటాడని ఆయన బంధువులు పేర్కొంటున్నారు.

శతాబ్దాలుగా తాము అనుభవిస్తున్న కష్టాలను, అటవీ, సహజ సంపదలపై నిజాం సర్కారు పన్నులు వసూలు చేయడం, ఈ నెపంతో చౌకీదార్‌లు, పట్వారీలు గోండు గూడాలను దోచుకోవడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం భీమ్‌ను బాగా కలచివేశాయి. దీంతో ఆయన స్థానికంగా ఉన్న జమీందార్లు, చౌకీదార్లపై నిజాం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ వెళ్లాడు. కానీ నిజాం ప్రభువు భీమ్‌ను కలవకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అన్యాయాలపై పోరాడేందుకు నిశ్చయించుకున్నాడు.
 
గెరిల్లా సైన్యం ఏర్పాటు
జల్.. జంగల్.. జమీన్.. హక్కుల కోసం పోరాడటానికి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క గిరిజన యువకుడుని చేరదీసి సైన్యం ఏర్పాటు చేశాడు. వెదురు కొట్టడం, విల్లంబులు, బాణాలు తయారు చేయడం వారికి నేర్పించాడు. ఉచ్చులు పెట్టడం, గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చాడు. అంతే కాకుండా బర్మారా(ఒక రకమైన నాటు తుపాకులు) ఇంటికొకటి ఉండాలని చెప్పేవాడు. గెరిల్లా దాడులకు కత్తులు, గొడ్డల్లను ఉపయోగించేవారు. కొమురం సూరుఅనే వ్యక్తి భీమ్‌కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించేవాడని చరిత్రకారులు చెప్తున్నారు. అరక (నాగలి), పొరక, మేకలు, కంచె, మంచెలపై నిజాం ప్రభుత్వం తరఫున పట్వారీలు, చౌకీదార్లు పట్టీలు (పన్నులు) వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారిపై కొమురం భీమ్ దళం దాడులు చేసేవారు.
 
మడావి కొద్దు
సమాచారంతో..అశ్వీయుజ మాసం శుద్ధ పౌర్ణమి రోజున(1-09-1940) కొమురం భీమ్ సైన్యంలో పనిచేసే మడావి కొద్దు అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం ఆయనను కెరమెరి గుట్టల్లోని జోడేఘాట్ వద్ద తుపాకులతో భీమ్‌ను కాల్చి చంపింది. అంతకుముందే భీమ్ పోరాటాన్ని అణచివేయడానికి నిజాం ప్రభుత్వం, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున సైనికులను మోహరించి భీమ్ సైన్యం కోసం గాలింపులు చేపట్టింది. భీమ్ నిజాం సైన్యం కాల్పుల్లో మరణించడంతో ఆయన అనుచరులు చెల్లాచెదురయ్యారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా గోపాల్‌రావు దళం చేతిలో మడావి కొద్దు చనిపోయినట్లు చె ప్తుంటారు. ఆనాడు జల్.. జంగల్.. జమీ న్.. కోసం కొమురం భీమ్ రగిలించిన పోరాట స్పూర్తి గిరిజనుల్లో ఇంకా రగులుతూనే ఉంది. మూడు దశాబ్దాలుగా ఏటా అశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజునే భీమ్ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు.
 
కేసులు నమోదు
గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడే పట్టేదారులపై భీమ్ దాడులు చేసేవాడు. సిద్ధిక్ అనే ఆసిఫాబాద్ పట్టేదారును హతమార్చాడు. దీంతో నిజాం ప్రభుత్వం కొమురం భీమ్‌పై కేసులు నమోదు చేసింది.
 
గిరిరత్న అవార్డు
గిరిజన హక్కుల కోసం భీమ్ చేసిన ఏళ్లనాటి పోరాట ఫలితంగా మూడేళ్ల క్రితం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ప్రభుత్వం భీమ్‌కు గిరిరత్న అవార్డు ప్రదానం చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అప్పటి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అక్కడి ఐటీడీఏలో ఏపీవోగా పనిచేసే జిల్లాకు చెందిన వసంతరావు అవార్డును అందుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చే యడం జిల్లాకే అరుదైన గౌరవం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement