సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ సోమవారం నగరానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు ఇప్పటికే సిటీకి చేరుకున్నారు. వీరితో రెండుసార్లు సమావేశమైన కొత్వాల్ అంజనీకుమార్ ఏర్పాట్లను వివరించారు. స్టేడియంను సైతం పరిశీలించిన బృందం పలు కీలక సూచనలు చేసింది. ఎల్బీస్టేడియంలో సోమవారం జరిగే సభ నేపథ్యంలో పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు ఇవి అమలులో ఉంటాయని ఆదివారం కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
♦ ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు.
♦ అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు.
♦ బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు.
♦ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
♦ కింగ్ కోఠి భారతీయ విద్యాభవన్ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను తాజ్‌మహల్ హోటల్ మీదుగా పంపిస్తారు.
♦ లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు వెళ్లాలి.
♦ కార్యక్రమానికి వచ్చే ఆహుతులు, పాస్‌లు ఉన్న వారికి ఈ మళ్లిపులు వర్తించవు. వీరికి ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, గేట్లుకేటాయించారు.
రాహుల్ రాక నేపథ్యంలో..
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సోమవారం సిటీలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగే ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో రాత్రి 7 గంటలకు వెళ్లనున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీరామ్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగే కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. దీన్ని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment