
నేడు వరద కాల్వకు నీటివిడుదల
పెద్దవూర : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరద కాల్వకు బుధవారం ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు.
పెద్దవూర : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరద కాల్వకు బుధవారం ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 580 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేయాలని నిర్ణయిం చినట్టు డీఈ కిషోర్ మంగళవారం తెలిపారు. అయితే ప్రధాన కాల్వతోపాటు డిస్ట్రిబ్యూటరీలు, పిల్లల కాల్వలు అస్తవ్యస్తంగా ఉండడం నీరు సాఫీగా వెళ్తుందా..లేదా అన్నది అనుమానంగా ఉంది. సాగర్ జలాశయ నీటిమట్టం 575 అడుగులకు చేరినప్పుడు గ్రావిటీ ద్వారా వరదకాలువకు విడుదల చేయడానికి సాధ్యమవుతుంది. సోమవారం సాయంత్రానికే జలాశయ నీటిమట్టం 575 అడుగుల స్థాయికి చేరడం.. పై నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో నీటి విడుదలకు సిద్ధమయ్యారు. కాగా, గత ఏడాది ఆగస్టు 6వ తేదీనే వరద కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గేట్లకు, చైన్లకు గ్రీజింగ్ చేశారు. కొద్దిగా ఎత్తులేపి ట్రయల్ చేసి సిద్ధంగా ఉంచారు.
80వేల ఎకరాలకు సాగునీరు
నాన్‌ఆయకట్టు ప్రాంతానికి నీరందించే ఈ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ప్రయోజనం అందించే విధంగా రూపొందించారు. ఏఎమ్మార్పీ లోలెవల్ వరదకాల్వ కింద నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లోని ఏడు మండలాలకు పెద్దవూర, అనుముల, కనగల్, నిడమనూరు, వేములపల్లి, తిప్పర్తి, నకిరేకల్ మండలాలలో 80వేల ఎకరాలకు సాగునీరు అందేలా డిజైన్ చేశారు. అదే విధంగా 200 చెరువులకు నీటిని నింపటంతోపాటు 250 గ్రామాలకు తాగునీరు అందించనుంది.
అసంపూర్తిగా పనులు..
85 కిలోమీటర్లు గల ఈ కాల్వను రెండు ప్యాకేజీలుగా విభజించి 63 కిలోమీటర్లు మొదటి ప్యాకేజీగానూ, మిగతాది రెండవ ప్యాకేజీగానూ విభజించి పనులు చేపట్టారు. ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు 80శాతం కూడా పూర్తికాలేదు. రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. ఆ తర్వాత వాటిని పునఃప్రారంభించడం మరిచిపోయారు. కాలువలకు నీటిని విడుదల చేసినా రైతుల పొలాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదు. ప్రధాన కాల్వకు సమీపంలో ఉన్న రైతులు మాత్రమే చైనా పంపులను ఏర్పాటు చేసుకుని పారించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
చివరి దశలో పంప్‌హౌస్ పనులు..
సాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీరు ఉన్నప్పుడే వరద కాల్వకు నీటి విడుదల సాధ్యమవుతుంది. దీనికంటే తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల సాధ్యం కాదు. జలాశయంలో 515 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరినప్పుడు సైతం ఆయా మండలాలకు సాగు, తాగునీటిని అందించేందుకు రూ.108 కోట్లతో పంప్‌హౌస్ పనులు చేపట్టారు. ఈ పనులు సైతం ఈ యేడాది చివరి నాటికి పూర్తి కానున్నాయి. గ్రావిటీ ద్వారా నీటి విడుదలకు కావాల్సిన పరిమాణంలో నీటిమట్టం ఉండటంతో వరద కాలువ ప్రధాన ముఖద్వారం వద్ద క్రస్ట్ గేటును నీళ్లు తాకాయి. దీంతో క్రస్ట్‌గేట్లను లేపితే గ్రావిటీ ద్వారా నీరు అప్రోచ్ కెనాల్‌కు వెళ్తుంది.