తెలంగాణ సీఎస్‌తో వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్ ఫీజుల పెంపు, కౌన్సెలింగ్ తేదీల ఖ రారుపై సోమవారం స్పష్టత రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమావేశమై దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు ఫీజుల పెంపు, కౌన్సెలింగ్ తేదీల నిర్ణయంపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. శనివారం ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సోమవారం కేసీఆర్ రాష్ట్రానికి వస్తున్నందున ఆయనతో సమావేశమైన అనంతరం కౌన్సెలింగ్ తేదీ, ఫీజుల పెంపుపై ఉత్తర్వులను వెలువరించాలని నిర్ణయించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలాఖరు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఆ లోగానే కౌన్సెలింగ్‌ను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సూపర్ స్పెషాలిటీ కోర్సుల దరఖాస్తుల గడువు 25 దాకా పొడిగింపు
విజయవాడ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో అడ్మిషన్లకు అభ్యర్థులు ఈ నెల 25 వరకూ అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం వెబ్‌సైట్‌లో దరఖాస్తులు పొందడానికి 22 చివరి తేదీగా పేర్కొనగా, మరో మూడ్రోజులు పెంచుతూ ఈ నెల 25 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www;//ntruhs.ap.nic.inను చూడవచ్చు.