టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే ఎక్కువ పోటీ!
Published Mon, Mar 23 2015 6:48 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
25న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రాజకీయ పార్టీల్లో భిన్న అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఆదివారం నాటి పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్యే ఎక్కువ పోటీ ఉన్నట్లు కనిపించింది. గత రెండు దఫాలుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కె.నాగేశ్వర్ అనూహ్య విజయం సాధించగా.. ఈసారి స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా 31మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. జిల్లాలో మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది.
సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ శాసన మండలి ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎన్నుకోవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 31 మంది పోటీలో నిలిచారు. ఇందులో అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు. కానీ ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అభ్యర్థులకు ఓటు వేయాలి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకే కాకుండా స్వతంత్రంగా నిలిచిన వారికి సైతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో తొలి రెండు ప్రాధాన్యత ఓట్లు టీఆర్‌ఎస్, బీజేపీలకు పోలయినట్లు తెలుస్తోంది.
అటు ఇటుగా..
తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున ఉద్యోగ సంఘం నేత దీవీప్రసాద్ పోటీ చేయగా.. బీజేపీ తరపున ఎన్.రాంచందర్‌రావు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం తోడవడంతో పాటు ఉద్యోగ సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయి. దీంతో మెజార్టీ ఓట్లు తమకే వస్తాయని భావించి.. ఆ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలో జిల్లాలోని కొన్ని ఉద్యోగ సంఘాల్లో కొంత చీలిక రావడం, ఎక్కువ ఓటర్లుగా ఉన్న టీచర్లు దేవీప్రసాద్ అభ్యర్థిత్వానికి సహకరించకపోవడంతో పరిస్థితి కొంత తారుమారైంది. అదే తరుణంలో బీజేపీ అభ్యర్థికి ఏబీవీపీ, టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌లు బాసటగా నిలిచాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలు అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఓటర్లను ఆకర్షించడంతో తమదైన శైలిలో ముందుకెళ్లారు. దీంతో చివరి నిమిషంలో వారికి మద్దతు పెరిగింది. మొత్తంగా ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో ఒకరు విజయం సాధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో ఈ పరిస్థితి ఎవరికి మేలు కానుందో వేచిచూడాల్సిందే. ఈ నెల 25న ఓట్ల లెక్కింపుల్లో జాతకాలు బయటపడనున్నాయి.
Advertisement
Advertisement