ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాతర్లపల్లి గ్రామస్తులు
ఇల్లందకుంట (హుజూరాబాద్): అదో మారుమూల గ్రామం. అక్కడ సుమారు 450 కుటుంబాలు, 1,500 మంది జనాభా ఉంటారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు 200 మంది తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరాల బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తమకు కూడా జ్వరాలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో అనేకమంది గ్రామస్తులు ఊరునే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని పాతర్లపల్లిలో ఊరుఊరంతా విషజ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికికాలువల్లో దోమల లార్వా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
15 రోజుల్లో నలుగురి దుర్మరణం
గ్రామంలో కొద్దిరోజులుగా 200 మందికి పైగా తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ లచ్చమ్మ, కోడారి రాజవీరు, బాలమ్మ చనిపోయారు. తాజాగా అనుమండ్ల లక్ష్మి అనే మహిళకు విçషజ్వరం రావడంతో ఆమెను కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆదివారం చనిపోయింది.
ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఉదయం నుంచే వరంగల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల బాటపట్టారు. జమ్మికుంటలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చూసినా పాతర్లపల్లికి చెందిన వారే కనిపిస్తున్నారు. కొందరు కరీంనగర్, హన్మకొండలలో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుం టున్నారు. వైద్యాధికారులు నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోయారని, మురికికాలువల్లో మందు చల్లి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు.
మంత్రి ఈటల రాజేందర్ ఆరా..
విషజ్వరాలపై ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment