సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కరోనా వైరస్ బారి న పడ్డారు. ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారని, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గాంధీభవన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కాగా, లాక్‌డౌన్ సమయం లో గూడూరు పేదలకు అండగా ఉండేం దుకు పార్టీ పక్షాన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పనిచేశారు. గూడూరుకు కోవిడ్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆయన త్వరలోనే కోలుకుం టారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
కమ్యూనిటీ వ్యాప్తి జరిగింది...
రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందని, ఇందుకు తన కేసే ఉదాహరణ అని గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు. ‘నేను ఇటీవల విదేశాలకు గానీ, ఇతర ప్రదేశాలకు గానీ ప్రయాణం చేయలేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను, వారికి సన్నిహితంగా ఉన్న వారిని కూడా కలవలేదు. అయినా నాకు కరోనా వచ్చిందంటే రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరిగినట్లేనని భావించాలి. ఈ విషయాన్ని నేను చెబుతున్నా ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఇప్పటిౖకైనా తగిన చర్యలు తీసుకోవాలి’అని గూడూరు బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
కోఠి ఈఎన్‌టీ డాక్టర్‌కు పాజిటివ్..
సుల్తాన్‌బజార్: కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆయన కింగ్‌కోఠి ఆస్పత్రిలో కూడా సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీతో పలుమార్లు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ద్వారానే ఈ డాక్టర్‌కు కరోనా సోకినట్లు భావిస్తున్నారు.
బంజారాహిల్స్ పీఎస్ ఎస్‌ఐకి కూడా..
జూబ్లీహిల్స్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్‌ఐకి, ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. దీంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిపిన కరోనా పరీక్షల్లో బంజారాహిల్స్‌కు చెందిన 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment