సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34 చోట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇన్‌చార్జులు లేకుండా పోయారు. పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు, ఓడిపోయిన వారితోపాటు గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు సీట్లు ఇచ్చిన చోట ఉన్న నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారికంగా బాధ్యతలు తీసుకునే నాయకులే లేకుండా పోయారు. ఈ స్థానాల్లో కంగాళీ పరిస్థితులు ఏర్పడి నెలలు గడుస్తున్నా అక్కడ ఇన్‌చార్జులుగా ఎవరిని నియమించాలన్న దానిపై టీపీసీసీ పెద్దలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో ఆయా స్థానాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు ఆశిస్తున్న నేతలతోపాటు క్షేత్రస్థాయి కేడర్‌లోనూ నైరాశ్యం నెలకొంది.
జంపింగ్‌ల స్థానాలపై స్పష్టతేదీ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), బానోతు హరిప్రియ (ఇల్లెందు), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), విష్ణువర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), కె.ఉపేందర్‌రెడ్డి (పాలేరు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు)లు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీతో విభేదించి దూరంగా ఉంటున్నారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అధికారికంగా పార్టీ ఇన్‌చార్జులను నియమించలేదు. దీంతో తమ నేత ఎవరో అర్థంగాక స్థానిక కేడర్ తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా స్థానాల్లో పార్టీ బాధ్యతలు చూడాలని అంతర్గతంగా కొందరికి సమాచారం ఇచ్చినా ఫలానా నియోజకవర్గానికి ఫలానా నాయకుడు ఇన్‌చార్జి అనే ఉత్తర్వులు లేకపోవడంతో ఇన్‌చార్జి స్థానాలు ఆశిస్తున్న నేతలు కూడా సమన్వయంతో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అక్కడా అయోమయమే..
ఎమ్మెల్యేలే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు, పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలు పోటీ చేసిన స్థానాల్లో అప్పటివరకు కాంగ్రెస్ ఇన్‌చార్జులుగా ఉన్న నేతల్లో కొందరు అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఈ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ బాధ్యతలు తీసుకునేందుకు నేతలు ఉన్నా ఇంకా వారికి బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడ పార్టీ ఇన్‌చార్జి కోసం ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో సునీతపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 5 వేల ఓట్లు సాధించిన లక్ష్మీ రవీందర్‌రెడ్డితోపాటు రాజారెడ్డి అనే నేత పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
షాద్‌నగర్‌లో పోటీ చేసిన ప్రతాప్‌రెడ్డి స్థానంలో రాజు యాదవ్, దేవరకద్రలో పవన్‌కుమార్‌రెడ్డి స్థానంలో ప్రదీప్‌గౌడ్, హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి స్థానంలో బొమ్మా శ్రీరామ్‌చక్రవర్తి, ఆలేరులో బూడిద భిక్షమయ్యగౌడ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్‌ల పేర్లు వినిపిస్తున్నా వారికి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కేఎస్ రత్నం స్థానంలో చేవెళ్ల నుంచి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించామని చెబుతున్నా అక్కడా అధికారిక ఉత్తర్వుల్లేవు. అదే విధంగా వైరా, మానకొండూరు, మెదక్, రాజేంద్రనగర్, సత్తుపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు, ఇతర పార్టీలు పోటీ చేసిన మరికొన్ని స్థానాలు కలసి మొత్తం 34 చోట్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఏం చేయాలన్న దానిపై ఇటీవల జరిగిన టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఏం చేయాలన్న దానిపై టీపీసీసీ పెద్దలు నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
చర్చించాం.. నిర్ణయం తీసుకుంటాం
రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జుల నియామకంపై కోర్ కమిటీ చర్చించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు లేని చోట నేరుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తాం. ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడుతున్న స్థానాల్లో ఐదుగురితో కలసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఇన్‌చార్జి పోస్టు ఆశిస్తున్న వారిని కన్వీనర్లుగా, ఇతరులను సభ్యులుగా నియమిస్తాం. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.
– జెట్టి కుసుమ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment