
దేశంలో ఈ రెండు పరివారాల మధ్య యుద్ధం
మోదీ రాజ్యాంగాన్నిమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు
రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారు
మనం రాహుల్‌తో కలిసి నడవాలి
ఇండోర్ సంవిధాన్ బచావో ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి గాంధీ పరివారం.. మరోటి గాడ్సే పరివారం. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు. గాడ్సే పరివారం నుంచి మోదీ ఉన్నారు. మనమంతా గాంధీ పరివారంగా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి. రాహుల్ నేతృత్వంలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఓ యుద్ధమని అభివర్ణించారు. ‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ మోదీ రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారు. గజనీ మహ్మద్ నాడు భారత్‌ను దోచుకునేందుకు యత్నించినట్టు నేడు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. మోదీ యత్నాలు ముందే గుర్తించిన రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు.
నాడు బ్రిటిషర్ల నుంచి దేశాన్ని మహాత్మాగాంధీ రక్షించినట్టు నేడు బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఆయన నిలబడ్డారు. ఈ యుద్ధంలో అందరూ రాహుల్‌గాంధీతో కలిసి నడవాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment