శెభాష్ నరేష్...
స్నాచర్లను వెంబడించి పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
ఆటోనగర్: రాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తతో ముగ్గురు దొంగలు చిక్కారు. గొలుసు చోరీకి యత్నించి పారిపోతున్న నిందితులను కానిస్టేబుల్ వెంబడించి పట్టుకొని స్థానికులు, అధికారులతో శెభాష్ అనిపించుకున్నాడు. వివరాలు... రామంతాపూర్‌కు చెందిన కన్నెకంటి పరశురాం, విజయ దంపతులు శనివారం రాత్రి హయత్‌నగర్ నుంచి ఇంటికి వెళ్తున్నారు.
ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి పల్సర్ వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు విజయ మెడలోని బంగారు గొలుసును లాగారు. అయితే, చైన్‌తెగిపోవడంతో వారి చేతికి చిక్కలేదు. దొంగలు పారిపోతూ సుష్మా చౌరస్తా నుంచి రైతుబజార్ వైపు మళ్లారు. దొంగలు.. దొంగలంటూ పరశురాం కేకలు వేయగా... ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ నరేష్ అప్రమత్తమయ్యాడు.
పరుగెత్తుకుంటూ వెళ్లి దొంగల బైక్‌ను ఆపాడు. ముగ్గురిలో ఒకడు బైక్ దిగి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరిని కానిస్టేబుల్ నరేష్ పట్టుకుని రోడ్డుపక్కనే ఉన్న చిరు వ్యాపారి షాపులో బంధించి షట్టర్‌వేశాడు. ముగ్గురు దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. కానిస్టేబుల్ నరేష్ సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కొంత కాలంగా వరుస చైన్‌స్నాచింగ్‌లతో బెంబేలెత్తుతున్న మహిళలు శనివారం రాత్రి ముగ్గురు దొంగలు పట్టుబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. దొంగలను పట్టుకున్నా ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్‌ను అధికారులు, స్థానికులు అభినందించారు.