సాక్షి, సిటీబ్యూరో: ‘‘ట్రాఫిక్ నియమాలను తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఇబ్బంది రాకపోవచ్చు. ఆ ధోరణి మారకుంటే వందోసారైనా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడు చెల్లించడం ఒక ఎత్తు.. ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే ఆ కుటుంబం పడే బాధ, వ్యధ మరో ఎత్తు. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘనుల దృష్టిలో ‘పొరపాటు’గా అనుకున్న అనేక సంఘనలు బాధితుల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్, నో ఎంట్రీ మార్గాల్లోకి వాహనాలతో రావ డం ప్రధానమైంది. వీటికితోడు మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా ఆటోలు తిప్పడం వంటి ఉల్లంఘనలు సైతం ఎదుటి వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలతో నగరంలో పదేపదే చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
ఒకరి నిర్లక్ష్యానికి మరో కుటుంబం బలి
రోడ్డుపై ప్రయాణిస్తూ కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు.. అది వన్‌వేగా కనిపిస్తున్నా.. రాంగ్ రూట్ అని తెలిసినా పట్టించుకోకుండా దూసుకుపోతున్నారు. ‘నో ఎంట్రీ’ మార్గాల్లో ఇలాగే ప్రవర్తిస్తున్నారు. బైకర్ల నుంచి భారీ వాహనాల డ్రైవర్లు సైతం నో ఎంట్రీల్లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహనచోదకులు చిన్న చిన్న ప్రమాదాలకు గురవడంతో పాటు అనేక దారుణమైన సంఘటనలకూ కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి రాంగ్‌రూట్/ నిర్లక్ష్య డ్రైవింగ్ ఎదుటి వారి ఉసురు తీయడంతో పాటు వారి కుటుంబాన్నే కకావికలం చేస్తున్నాయి. 2013లో ముషీరాబాద్ ఏఎస్సై సత్యనారాయణ ఉసురు తీసిన మరణమే దీనికి నిదర్శనం.
మూడు కేటగిరీలుగా ఉల్లంఘనలు
రహదారి నిబంధనల ఉల్లంఘనలను ట్రాఫిక్ విభాగం అధికారులు మూడు కేటగిరీలు పరిగణిస్తారు. వాహన చోదకుడికి ప్రమాదకరంగా మారే వి మొదటిది కాగా, ఎదుటి వ్యక్తికి నష్టం కలిగిం చేవి రెండోది. వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పు తెచ్చేవి మూడో కేటగిరీకి చెందినవి. ప్రస్తుతం నగర ట్రాఫిక్ అ«ధికారులు ఈ మూ డో కేటగిరీపై దృష్టి పెట్టారు. పదేపదే ప్రమాదాలకు కారణమవుతున్న ఏడు రకాలైన అంశాలను గుర్తించారు. వీరిపై అనునిత్యం స్పెష ల్ డ్రైవ్స్ చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాల ను రంగంలోకి దింపారు. అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ పర్యవేక్షణలోనే ఇవి పనిచేస్తున్నాయి.
కొన్ని చర్యలు తీసుకున్నా..
‘మూడో కేటగిరీ’ ఉల్లంఘనలకు చెక్ చెప్పడానికి ఇప్పటికే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ‘రాంగ్ రూట్, నో ఎంట్రీ’ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డులను మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కం ట్రోల్ రూమ్ ద్వారా ఈ–చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి ప్రాణాలు తీసుకోవడం/తీయడం చేస్తున్నారు.
రంగంలోకి నాలుగు బృందాలు
ట్రాఫిక్ ఉల్లంఘనులకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పాలని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా తనిఖీల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రస్తుతం స్థానిక పోలీసుల ఆధీనంలో పనిచేస్తున్న టీమ్స్ అన్ని తరహా ఉల్లంఘనలు, రెగ్యులేషన్‌పై దృష్టి పెడతాయి. అయితే, ఈ ప్రత్యేక బృందాలు మాత్రం కేవలం ఏడు రకాలైన ఉల్లంఘనల్నే పరిగణలోకి తీసుకుని డ్రైవ్స్ చేస్తాయి. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఒక్కో బృందంలో ఎస్సై, ఏఎస్సై, హెడ్–కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. ప్రతిరోజు ట్రాఫిక్ చీఫ్ ఆదేశాల మేరకు వీరు నగరంలోనే ఏ ప్రాంతంలో అయినా తనిఖీలు చేస్తారు. ఏ ఠాణా పరిధిలో డ్రైవ్ చేస్తుంటే అక్కడి స్థానిక ఎస్సై వీరికి సహకరిస్తారు. బుధవారం నుంచే ఈ టీమ్స్ రంగంలోకి దిగి తొలిరోజు 66 కేసులు నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment