నల్లగొండ క్రైం : పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ నడుం బిగించింది. పూటుగా తాగి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. నిత్యం జిల్లా వ్యాప్తం గా ముమ్మరంగా ‘బ్రీత్ ఎనలైజర్ టెస్ట్’లు నిర్వహిస్తూ మందుబాబులను జైలుకు పంపిస్తోంది.
ముఖ్య పట్టణాల్లో..
మందు బాబులను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ పరంగా అన్ని ముఖ్య పట్టణాల్లో బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మోతాదుకు మించిన ఆల్కహాల్ ఉంటే జైలుకే పంపుతున్నారు. జిల్లాలో భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, పోలీసు డివిజన్ కేంద్రా ల్లో సివిల్, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
రోజూ తనిఖీలు చేస్తాం : సీఐ ఆదిరెడ్డి
తాగిన మైకంలో వాహనాలు నడపకుండా ఉండేందుకు రోజూ పట్టణంలో డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహిస్తాం. 30శాతం మించితే అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెడతాం. జడ్జి నిర్ణయం, తగిన మోతాదును బట్టి జైలు శిక్ష ఉంటుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇవి
సంవత్సరం 2011 2012 2013 2014
కేసులు 211 1162 912 850
గుర్తించేది ఇలా...
మద్యం తాగి వాహనాలు నడిపే వారిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షిస్తారు. బ్రీత్‌స్ట్రోను మద్యం తగిన వ్యక్తినోట్లో పెట్టి ఊదిస్తారు. వెంటనే ఎంత మోతాదులో మద్యం తాగాడో నమోదు అవుతుంది. ప్రతి 100 మిల్లీమీటర్ల రక్తంలో 30 మిల్లి గ్రాములకంటే ఎక్కువగా బ్రీత్ ఎనలైజర్ ద్వారా నమోదు అయితే వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు సంబంధిత వాహనాన్ని సీజ్ చేస్తారు.
ఒక్కలైట్ బీరు తాగితే 30శాతం చూపుతుంది.
స్ట్రాంగ్ బీరుకు 35శాతం..
రెండు పెగ్‌లు దాటినా 30శాతం దాటి చిక్కి పోతారు
ప్రమాదాలు తగ్గించేందుకే..
తాగిన మైకంలో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అన్ని ముఖ్య పట్టణ కేంద్రాల్లో, పట్టణాల్లోకి వచ్చే ప్రధాన రహదారుల్లో సాయంత్రం 6 నుంచి 11గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో యువతనే మరణిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వృద్ధాప్యంలో అండగా ఉంటారని ఆశిస్తున్న తల్లిదండ్రులకు చేతికి అందిన కుమారులు మృత్యువాత పడటంతో కడుపుకోతను తట్టుకోలేకపోతున్నారు. మందు తాగి రోడ్డు ప్రమాదాలు మృతిచెందారని తెలుస్తుండటంతో కుటుంబం పరువు బజారున పడటం ఆ తల్లిదండ్రులకు చెడ్డపేరు తెచ్చి ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 325 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా ఇందులో 75 మంది వరకు మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల్లోనే మృతిచెందినట్లు సమాచారం.
సుక్కేసి నడిపితే..జైలుకే..!
Published Sun, Dec 21 2014 2:17 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement