
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మాదిగ విద్యార్థులకు జనవరి 6, 7 తేదీల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఎమ్మార్పీఎస్ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. పాతికేళ్లుగా ఎమ్మార్పీఎస్ వర్గీకరణపైనే దృష్టి పెట్టి ఎంతో నష్టపోయిందన్నారు.
విద్యానగర్ టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం శిక్షణ తరగతుల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దండోరా ఉద్యమాన్ని రాజకీయంగా మలచుకోవడానికే తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 6న ఉదయం మేడిపాపయ్య స్వాగతోపన్యాసంతో తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి.కృపాకర్ మాదిగ, ఎంబీసీ సిద్ధాంత కర్త కోప్రా, సుంకపాక దేవయ్య, గద్దర్, ఎలిషా కుమార్, జూపాక సుభద్ర, అల్లం నారాయణ, టి.హన్మంతు శిక్షణ తరగతులకు హాజరవుతారన్నారు. సమావేశంలో సుంకపాక దేవయ్య మాదిగ, యాతాకుల భాస్కర్, మేడిపాపయ్య తదితరులు పాల్గొన్నారు.