srinivas madiga
-
‘ఢిల్లీలో కేసీఆర్ దీక్షకు ఎమ్మార్పీఎస్ మద్దతు’
ముషీరాబాద్ (హైదరాబాద్): ఢిల్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11న రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రకటించారు. శనివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లను, పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లు సాధించేవరకు ఎమ్మార్పీఎస్ వారికి తోడుగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటును అందిస్తూ రైతు బాంధవుడిగా ఎల్లవేళలా అండగా ఉంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, చింతం తిరుపతి, శాగంటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మాదిగలకిచ్చిన హామీలను నెరవేర్చాలి
హైదరాబాద్: మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆత్మబలిదానం చేసిన భారతి కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తానని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు మాట నిలుపుకోలేదని అన్నారు. ‘డప్పు, చెప్పు’కు 2 వేల పింఛన్ ఇస్తామని, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయిస్తామని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బెడ, బుడిగ జంగాల హక్కులదండు వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పాటి హనుమంత్, మాదిగ ఉపకులాల అధ్యక్షులు మురళి, కొల్లూరి వెంకట్, రమేశ్, శ్యామ్‌రావు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
6, 7 తేదీల్లో శిక్షణ తరగతులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మాదిగ విద్యార్థులకు జనవరి 6, 7 తేదీల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఎమ్మార్పీఎస్ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. పాతికేళ్లుగా ఎమ్మార్పీఎస్ వర్గీకరణపైనే దృష్టి పెట్టి ఎంతో నష్టపోయిందన్నారు. విద్యానగర్ టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం శిక్షణ తరగతుల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దండోరా ఉద్యమాన్ని రాజకీయంగా మలచుకోవడానికే తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 6న ఉదయం మేడిపాపయ్య స్వాగతోపన్యాసంతో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి.కృపాకర్ మాదిగ, ఎంబీసీ సిద్ధాంత కర్త కోప్రా, సుంకపాక దేవయ్య, గద్దర్, ఎలిషా కుమార్, జూపాక సుభద్ర, అల్లం నారాయణ, టి.హన్మంతు శిక్షణ తరగతులకు హాజరవుతారన్నారు. సమావేశంలో సుంకపాక దేవయ్య మాదిగ, యాతాకుల భాస్కర్, మేడిపాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాదిగల అభివృద్ధే ధ్యేయం
హైదరాబాద్: అక్షరమే ఆయుధమనే లక్ష్యం తో మాదిగల అభివృద్ధి దిశగా మలిదశ ఉద్య మం సాగుతోందని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మంద కృష్ణ నేతృత్వంలో 23 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమంలో కార్యకర్తలపై వందలాది కేసులు మినహా సాధించే దేమీ లేదన్నారు. హైదరాబాద్ తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్స్‌లో సోమవారం మాదిగ అమరవీరుల శ్రద్ధాంజలి సభ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాటాకుల భాస్కర్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జెన్ను రమణయ్య పాల్గొన్నారు. వంగపల్లి మాట్లాడుతూ.. మంద కృష్ణ ఉద్యమ ద్రోహి అని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రేరేపిస్తూ అమాయక కార్యకర్తలను బలి చేస్తున్నారన్నారు. భారతి చనిపోయిన వెంటనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆమె కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా ప్రకటన చేయించామన్నారు. తామెవ రికీ అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించారని మేడి పాపయ్య మాదిగ అన్నారు. ఆదివారం జరిగిన ఘటనల్లో అమాయకులపై కేసులు ఎత్తేసి, మంద కృష్ణపై పీడీ యాక్టు ప్రయోగించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బినామీల పేరిట మందకృష్ణ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని యాటాకుల భాస్కర్ విమర్శించారు. 19న కొలనుపాకలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. -
చంద్రబాబుకు గుణపాఠం చెబుతాం: వంగపల్లి
నేడు విజయవాడలో తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సదస్సు ముషీరాబాద్ : ఎస్సీ వర్గీకరణను చేస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ తీర్మానం కూడా చేయకుండా మాదిగలను వంచించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని, చంద్రబాబుకు సహకరించిన మందకృష్ణ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర సమన్వయ కర్త వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ హెచ్చరించారు. విద్యానగర్‌లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కు అడ్డుగా ఉన్న అన్ని శక్తులను ఎదుర్కోనేందుకు టీఎంఆర్పీఎస్ సమాయత్తమవతోందన్నారు. చంద్రబాబు, మందకృష్ణలకు బుద్ధి చెప్పేందుకు తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈనెల 21న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. సమావేశంలో చిలుక ప్రభాకర్ మాదిగ, జి.శ్యాంరావు మాదిగ, ఆర్.కృష్ణమాదిగ, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.