కార్పెంటర్ డ్రిల్లింగ్ మిషిన్ మాయమైన వైనం
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఇటీవల దొంగలు పడ్డారు. ఇక్కడ పనిచేసేందుకు వచ్చిన కార్పెంటర్ డ్రిల్లింగ్ మిషిన్‌ను ఎత్తుకెళ్లారు. ఇది సిబ్బంది చేతివాటమా? బయటి వ్యక్తుల ప్రమేయమా తేలాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ బండిమెట్‌కు చెందిన శ్రీనివాసచారి కార్పెంటర్. చిన్నపాటి పనులు ఉండడంతో ఇతడిని వారం క్రితం టాస్క్‌ఫోర్స్ డీసీపీ కార్యాలయానికి పిలిపించారు. ఒక రోజు పని చేసిన తర్వాత ఇంకా మిగిలి ఉండటంతో తన డ్రిల్లింగ్ మిషన్, ఇతర సామగ్రిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలోని ఒక గదిలో పెట్టి ఇంటికి వెళ్లాడు.
ఉదయం పని చేసేందుకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి వెళ్లగా డ్రిల్లింగ్ మిషిన్ కనిపించలేదు. దీంతో శ్రీనివాసచారి అక్కడి సిబ్బందిని వాకబు చేయగా చోరీ అయినట్టు తెలిసింది. సుమారు రూ.10 వేల విలువ చేసే ఈ మిషిన్ పోవడంతో వారం రోజులుగా శ్రీనివాసచారి పనికి వెళ్లలేక , ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి రోజూ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి తన డ్రిల్లింగ్ మిషిన్ గురించి వాకబు చేస్తున్న అతడి ధీన పరిస్థితి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. మహంకాళి పోలీసుకు ఫిర్యాదు చేశామని త్వరలోనే దొరుకుతుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, ఈ చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని మహంకాళి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం.
టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో దొంగలు పడ్డారు?
Published Sat, Jan 30 2016 11:36 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement