ఆదిలాబాద్ క్రైం : జిల్లా పోలీసు శాఖలో బదిలీలు గోల.. గోలగా మారాయి. జిల్లా ఎస్పీ పోస్టు భర్తీలో సైతం ఉత్కంఠ ఏర్పడింది. అక్టోబర్ 26న జిల్లా ఎస్పీగా సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వచ్చేందుకు ఆయన విముఖత చూపడంతో 20 రోజులు ఎస్పీ భూపాల్‌రెడ్డినే కొనసాగించారు. జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి నవంబర్ 13న తరుణ్‌జోషిని ఎస్పీగా ప్ర భుత్వం నియమించింది. ఇలా.. ఎస్పీ క్యాడర్ నుంచి ఎస్సై స్థాయి వరకు జిల్లాలో జరిగే పోలీసు శాఖ బదిలీలన్నీ గందరగోళంగానే కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల కంటే ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువ కావడంతో బదిలీలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో అధికారి కోసం ఇద్దరు ప్రతిపాదనలు
జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న పోలీసు శాఖ బది లీలు ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేపుతున్నాయి. ఒక్కో స్థానం లో ఒక పోలీసు అధికారి కోసం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపడం వివాదానికి కారణమవుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్‌స్పెక్టర్ సర్కిల్‌లో రెండు నియోజకవర్గాల మండలాలు ఉన్నాయి. సాధారణంగా ఒక పోలీసు సర్కిల్‌లో నాలుగు పోలీసుస్టేషన్ల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్‌స్పెక్టర్ సర్కిల్‌లో ఒక నియోజకవర్గం నుంచి రెండు పోలీసుస్టేషన్‌లో, మరో నియోజకవర్గం నుంచి రెండు పోలీసుస్టేషన్‌లు ఉన్నాయి. ఇది పోలీసు శాఖ డివిజన్ల ప్రకారం వస్తాయి.
దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ స్టేషన్ల ఎస్సైలతోపాటు, సీఐ స్థానం స్థానాలు తాము సూచించిన వారికి అంటే తాము సూచించిన వారికంటూ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ కారణంగానే జిల్లా పోలీసు శాఖలో గత నెల రోజులుగా బదిలీలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ఎస్సైల బదిలీలతోపాటు, సీఐల బదిలీలు ఎప్పుడు జరుగుతాయా.. అని ఎదురుచూస్తున్న ఆశవాహుల్లో నిరాశ మొదలవుతుంది. ప్రజాప్రతినిధుల సమన్వయలోపంతో బదిలీలు తరచూ నిలిచిపోతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.
పోటాపోటీగా..
జిల్లాలోని ఏడుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఉత్వర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆదిలాబాద్ ఏఎస్పీ, ఉట్నూర్, బెల్లంపెల్లి, భైంసా, కాగజ్‌నగర్, నిర్మల్ డీఎస్పీలందరనీ బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. వీరితోపాటు మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్‌ను సైబరాబాద్‌కు బదిలీ చేసినప్పటికీ ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఈ స్థానం కోసం ఓ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే పోటాపోటీగా ప్రతిపాదనలు పంపారు. మూడు రోజులపాటు ఉత్కంఠ గా నువ్వా నేనా.. అన్నట్లుగా లాబీయింగ్ చేశారు.
చివరకు ఈ నెల 21న హైదరాబాద్‌లో సీబీసీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న కరుణాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఎంపీ, ఎమ్మెల్యేల వివాదం ఓ కొలిక్కి రావడంతో డీఎస్పీ పోస్టును ఖరారు చేశారు. ఇలా డీఎస్పీ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో పోటీ జరిగిందంటే పోలీసు శాఖలో ఏ స్థాయిలో ప్రజాప్రతినిధుల ముద్ర పడుతుందో తెలుస్తోంది. ఇక సీఐ, ఎస్సైల విషయంలోనూ ఇదే రకమైన వివాదం సాగుతుండడంతో ఈ బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా.. పోటీ ఉన్న ప్రాంతంలో వారిని ఒప్పించడమే తరువాయి అన్నట్లుగా ఉంది.
లోపిస్తున్న పారదర్శకత..
రోజురోజుకు పోలీసుశాఖలో పారదర్శకత లోపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ శాఖలో అనిశ్చితి ఏర్పడుతోంది. ఏ పని చేసిన రాజకీయ జోక్యం పెరిగిపోవడం, ఏ అధికారి ఎప్పటి వరకు ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసు శాఖలో సీఐలు, ఎసై ్సల బదిలీలు జరగాలంటే ఐజీ, డీఐజీ, ఎస్పీల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు లేకుండా.. శాంతిభద్రతల్లో రాజీపడని.. బాగా పనిచేసే వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేసేవారు. కానీ ఇప్పుడు దీనికి విరుద్ధంగా నడుస్తోంది. పోలీసు శాఖ బదిలీలు పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోలీసుశాఖలో బదిలీల గోల
Published Mon, Nov 24 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement