నల్లగొండ అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సబ్‌ప్లాన్ ద్వారా జరుగుతున్న అభివృద్ధి, తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు వచ్చినట్లు న్యూఢిల్లీకి చెందిన రీసెర్చ్ పసిపిక్ ఇండియా సంస్థకు చెందిన రీసెర్చ్ డెరైక్టర్ జేమ్స్ వాషింగ్టన్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. తమ సంస్థకు చెందిన ఆపరేటివ్ మేనేజర్ జి.అంకుర్‌శర్మ, సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనిల్‌కుమార్, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, స్వచ్ఛంద పరిశోధకురాలు డాక్టర్ పి. మాధవిలతో కూడిన బృందం తెలంగాణలోని నల్లగొండ, ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు గాను ముందుగా ఆయా రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు టిడి. అరుణ, విద్యాసాగర్‌లను కలిసినట్లు చెప్పారు. టీఎస్‌పీ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై టెక్నికల్ అసెస్‌మెంట్ కోసం ప్రపంచ బ్యాంకు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో తాము పర్యటన సాగిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బ్లాక్‌లో 5 గ్రామపంచాయతీలను సందర్శిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమలు తీరు, లబ్ధిదారులు ఏమేరకు ప్రయోజనం పొందారు, అమలు ప్రభావం తీరుతెన్నులపై సమీక్షిస్తామని తెలిపారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి పాండునాయక్, మాడా పీఓ నాగేశ్వర్‌రావు, దేవరకొండ, మిర్యాలగూడ ఏటీడబ్ల్యూఓలు ప్రభువరణ్, సంజీవరావులతో సమావేశమై రూట్‌మ్యాప్, జిల్లాలో అమలు చేస్తున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు.
టీఎస్‌పీ అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం
Published Sun, Apr 26 2015 12:56 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement