భైంసా : తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ ఐటీ బాసరలోనే ఉంది. ఈ కళాశాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.వందల కోట్ల నిధులను విడుదల చేస్తోంది. అయినా.. ట్రిపుల్ ఐటీలో మాత్రం సమస్యలు పరిష్కారం కావడంలేదు. భారీ మొత్తంలో నిధులు విడుదలవుతున్నా.. అవి ఏమవుతున్నాయో.. ఎక్కడ ఖర్చు చేస్తున్నారో స్పష్టత లేదు. భోజన శాలల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
గతంలో మొక్కల పెంపకం, ఫర్నిచర్, మందుల కొనుగోళ్లలో కూడా ఇక్కడి అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు పరిష్కారం కావడంలేదు.
రోడ్లపైకి విద్యార్థులు..
బాసర ట్రిపుల్‌ఐటీలో 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు విద్యార్థులకు ఆందోళనలే శరణ్యమవుతున్నాయి. 2008 నుంచి విద్యార్థులు ఇప్పటికీ లెక్కలేనన్నిసార్లు రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. రెండేళ్ల క్రితం విద్యార్థులంతా సమ్మె చేపట్టి అప్పటి ఆర్‌జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ రాజ్‌కుమార్ వచ్చే వరకు నిరసన విరమించలేదు. విద్యార్థులకు సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. వారం రోజులపాటు తరగతులు పక్కనపెట్టి విద్యార్థులంతా ఒక్కటై పోరాడారు. అయినా.. ట్రిపుల్‌ఐటీ పరిస్థితి మారలేదు.
భోజనశాలల ఇష్టారాజ్యం..
వేల మంది విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీలో నాణ్యమైన భోజనం దొరకడం లేదు. భోజనశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలోనే నిధులు తీసుకుంటున్న మెస్ నిర్వాహకులు విద్యార్థులకు నాసిరకమైన ఆహారం అందిస్తున్నారు. మెనూ అమలు కావడం లేదు. మెస్‌కమిటీలు చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులకు యూనివర్సిటీకి ఆన్‌లైన్‌లో మెస్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా అక్కడి నుంచి అంతగా స్పందన ఉండడంలేదు. ట్రిపుల్‌ఐటీ కళాశాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ తరచూ మెస్‌లపై ఫిర్యాదు చేసే విద్యార్థులపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో మార్కుల కోత, చెడు ప్రవర్తన కలిగిన విద్యార్థులుగా ముద్రవేస్తారన్న భయం విద్యార్థుల్లో ఉంది.
దీంతో మెస్ యాజమాన్యాలు అందించే నాసిరకం భోజనంతోనే కడుపు నింపుకుంటున్నారు. చుట్టుపక్కల వారసంతల్లో లభించే కుల్లిన, వాడిపోయిన కూరగాయలను, నాసిరకంగా ఉన్న పప్పుదినుసులు, బియ్యాన్ని వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అయోడిన్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో ఎక్కడా ఆయోడిన్ ఉప్పు వాడినట్లు దాఖలాలు లేవు. భోజనశాలల్లో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గతంలోనే కళాశాల అధికారులకు మొట్టికాయలు వేసినా తీరుమారలేదు. గతంలో ప్రతినెలా జిల్లా ఉన్నతాధికారి సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని న్యాయస్థానం సూచించినా ఆ దిశగా చర్యలే లేవు.
ఒకే వైద్యుడు...
ట్రిపుల్‌ఐటీలో చదివే ఏడు వేల మంది విద్యార్థులకు ఒకేఒక్క వైద్యుడు ఉన్నాడు. ట్రిపుల్‌ఐటీలో గత సర్కారు ఐదుగురు వైద్యులను నియమించింది. వైద్యులందరికీ మెరుగైన జీతభత్యాలు, నివాసగృహం, భోజన వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి యూనివర్సిటీ అధికారులు విధుల్లోకి తీసుకున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీ అధికారులు వారికి సహాయసహకారాలు అందించలేదు. వైద్యులకు చెల్లించే జీతభత్యాల్లోనూ కోత విధించి ఇచ్చారు. ఇవి చూసి ఎవరికీ చెప్పుకోలేక వైద్యులంతా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. విద్యార్థినుల కోసం మహిళా వైద్యురాలిని నియమించాలని కోరుతున్నా ఇప్పటికీ స్పందన కనిపించడం లేదు.
పర్యవేక్షణ కరువు...
ట్రిపుల్‌ఐటీ బాసరలో ఉన్నా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడి పరిపాలన వివరాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో స్థానికంగా ఉండే సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంలేదు. జిల్లా యంత్రాంగం ట్రిపుల్ ఐటీకి సౌకర్యాలు కల్పిస్తున్నా పరిపాలన వ్యవహారాలపై ఇక్కడి యంత్రాంగానికి అధికారం లేకుండాపోయింది. అధికారులు నామమాత్ర పరిశీలనకే పరిమితం కావడంతో ట్రిపుల్‌ఐటీ సిబ్బంది ఎవరికీ జవాబుదారిగా ఉండడం లేదు. ఎంతో మంది చదువుతున్న ఈ సరస్వతీ నిలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
బాసర : తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. మెస్ నిర్వాహకులు ఉడికీఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. బుధవారం రాత్రి మిగిలిపోయిన అన్నం, కూరలనే గురువారం విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఈ1, ఈ2, ఈ3, ఈ4 విద్యార్థులు సుమారు రెండు గంటలకు పైగా ఆందోళనకు దిగారు. మెస్ కాంట్రాక్ట్‌ను తొలగించి కొత్త వారిని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని యాజమాన్యం విద్యార్థులకు నచ్చజెప్పాలని చూసినా వారు శాంతిం చలేదు. మార్వేల్ మెస్ కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. తదుపరి విద్యార్థి పరమేశ్వర్ ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణకు ఫోన్ ద్వారా సమస్యను తెలుపగా.. మార్వేల్ మెస్‌ను వెంటనే మరో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామని చెప్పారు. దీంతో విద్యార్థులు శాంతించా రు. విద్యార్థులకు మద్దతుగా ముథోల్ జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నూకం రామారావు, డెరైక్టర్ హన్మంతురావు, ఎంపీటీసీలు గెంటెల శ్యాం, పోతన్న, తదితరులు పాల్గొన్నారు.
ట్రబుల్ ఐటీ..
Published Fri, Feb 13 2015 3:13 AM | Last Updated on Fri, May 25 2018 1:22 PM
Advertisement
Advertisement