టీఆర్‌ఎస్ సర్కార్‌ది నిరంకుశ వైఖరి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి నిరంకుశంగా ఉందని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణలో ఎప్పటికీ తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని కలలు కంటూ అహంకారంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. శుక్రవారం టీడీఎల్‌పీ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్న నియంతృత్వ ఆలోచనలతో కేసీఆర్ పనిచేస్తుంటే రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీని సొంత జాగీరులా భావిస్తున్నారన్నారు.
జాతీయ గీతాన్ని అవమానపరిచిన ట్లు భావిస్తే సభలో వందసార్లైనా క్షమాపణలు చెపుతామన్నా స్పీకర్ ఒప్పుకోలేదని, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయన పనిచేశారన్నారు. తలసాని రాజీనామాను ఆమోదించాలని, లేదంటే మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని తాము కోరామని, పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోమన్నామని, అలా చేయకుండా తమ సభ్యులను సస్పెండ్ చేశారని విమర్శించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు విజయం సాధించడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందన్నారు. నల్ల గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపొందడం టీఆర్‌ఎస్‌కు సిగ్గుచేటన్నారు. సభలో లేని తనను, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని జాతీయ గీతం అవమానపరిచారని సస్పెండ్ చేయడంపై మంత్రి హరీశ్‌రావుకు సభా హక్కుల నోటీసు జారీ చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.