సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అభ్యర్థుల ప్రకటనపై ప్రతిష్టంభన నెలకొనడంతో ఆశావహుల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ వీడటం లేదు. బరిలోకి దిగనున్న అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇప్పటికే దాదాపు ఖరారైనా ప్రకటించడం లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగనున్న వారెవరో కూడా ఇంకా తేలలేదు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న ముఖ్యనేతలు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. టీఆర్‌ఎస్ నాయకులు కూడా కేసీఆర్‌తోపాటు, ఆ పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు.
ఒకవైపు జిల్లాలో ప్రాదేశిక సమరం కొనసాగుతోంది. ఒకరిద్దరు మినహా ముఖ్య నాయకులెవరూ ఈ ఎన్నికలను పక్కన బెట్టి టిక్కెట్ల వేటలో పడ్డారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న తమ అనుచరులకు బీ-ఫారాలు ఇప్పించుకున్న నేతలు ఇప్పుడు తమ బీ-ఫారాల కోసం పార్టీల అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్ల దాఖలుకు కేవలం ఐదు రోజులు మాత్రమే గడువుంది. ఈనెల 9 చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరోవైపు నామినేషన్ల పర్వం షురువైంది. కానీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నుంచి అభ్యర్థులెవరో తేలలేదు. ఈనెల 6న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలున్నాయని ఆ పార్టీ ఆశావహులు పేర్కొంటున్నారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌ల పొత్తు ఉండే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసమే అధిష్టానం తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదని ఆశావహులు భావిస్తున్నారు.
ఖరారు కానీ టీడీపీ-బీజేపీ సీట్లు
టీడీపీ, బీజేపీల పొత్తు ఓ కొలిక్కి వచ్చినా, సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ నెలకొంది. ఎవరి సీటు గల్లంతవుతుందోనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. సీట్లు ఖరారు కాకపోయినా టీడీపీ నాయకుడు రాథోడ్ రమేష్ తొలిరోజు నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ ఎంపీ, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానాలకు ఆయనతోపాటు, ఆయన కుమారుడు రితేష్ కూడా నామినేషన్ వేయడంతో ఆదిలోనే ఈ రెండు పార్టీల మధ్య వివాదం నెలకొంది. స్వంతంత్రులు కూడా ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తున్నారు. జిల్లాలో టీడీపీ, బీజేపీ స్థానాల విషయంలో స్పష్టత రావాలంటే కనీసం రెండు, మూడు రోజులు పట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంతోపాటు, మరికొన్ని స్థానాల విషయంలో రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని స్థానాన్ని తాము వదులుకోమని టీడీపీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు పట్టుబడుతున్నారు.
వీడని ఉత్కంఠ
Published Fri, Apr 4 2014 12:22 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement