రాజకీయలబ్ధికే బాబు పాకులాట: టీఆర్‌ఎస్
హైదరాబాద్: రాజకీయలబ్ధి కోసమే చంద్రబాబు పాకులాడుతున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో వార్‌రూమ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా శనివారం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వైఖరిలో ఇప్పటికైనా మార్పు రావాలని, రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతున్న ఈ తరుణంలో పరస్పర విమర్శలకు పోకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. యుద్ధాలు చేయడానికి వార్‌రూమ్ కాదని, ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడానికి, సమస్యలను పరిష్కరించడానికి అని స్వామిగౌడ్ వివరించారు. అన్నిరంగాల ఉద్యోగస్తుల సమాచారాన్ని వార్‌రూముకు పంపించాలని ఆయన కోరారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ మీద పెత్తనం చెలాయిస్తామంటే రెచ్చగొట్టడం కాదా? అని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని సూచించారు. విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలోని వారు అదే రాష్ట్రంలో పనిచేయాలన్నారు.
జోనల్ పోస్టుల్లోనూ ఉల్లంఘనలు: శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రకేడర్ పోస్టుల్లోనే కాకుండా జోనల్ పోస్టుల్లోనూ అనేక ఉల్లంఘనలు జరిగాయని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులు పోరాడింది ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలని తప్ప ఇతరుల కోసం కాదన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనాన్ని ఎలా అంగీకరిస్తామన్నారు. అవకతవకలపై శనివారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ మహంతిని కలిసి వినతిపత్రం అందచేశారు. ఓపెన్ కేటగిరిలో తెలంగాణ వారికి ఉద్యోగాలివ్వకుండా.. మెరిట్ వచ్చినప్పటికీ వారిని స్థానిక కోటాలోనే నియమించారని.. దీనివల్ల సీమాంధ్రులు ఎక్కువగా ఇక్కడ ఉద్యోగాలు పొందారన్నారు. తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించామని, కాని విభజన కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని వాపోయారు.