‘ఆధార్’... ఆందోళన! | trs govt backtracks on Aadhar link to Loan Waiver | Sakshi
Sakshi News home page

‘ఆధార్’... ఆందోళన!

Published Tue, Aug 26 2014 1:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

‘ఆధార్’... ఆందోళన! - Sakshi

‘ఆధార్’... ఆందోళన!

  సాక్షిప్రతినిధి, నల్లగొండ :అతివృష్టి, అనావృష్టితో గడిచిన మూడేళ్లుగా కోలుకోలేకపోతున్న జిల్లా రైతులు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీపై కొండంత ఆశ పెట్టుకున్నారు. దాదాపు మూడునెలలుగా నాన్చిన ప్రభుత్వం ఎట్టకేలకు జీఓ జారీ చేయడంతో బ్యాంకర్లు కార్యరంగంలోకి దిగారు. మాఫీ నిబంధనలను ఒకింత కఠినతరం చేసిన ప్రభుత్వం ఆధార్‌కార్డుకు కూడా లింకు పెట్టింది. వ్యవసాయ పంట రుణాలు పొందిన రైతులకు ఒక్కో కుటుంబానికి వడ్డీతో సహా కలిపి రూ.లక్ష వరకు మాఫీ వర్తించనుంది.  అయితే, పంటరుణాల మాఫీ కోసం రైతులు తమ బ్యాంకు పాస్‌బుక్,  పట్టాదారు పాసు పుస్తకం జిరాక్సు కాపీలతో పాటు ‘ఆధార్ కార్డు’ జిరాక్సు కాపీని కూడా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని బ్యాంకర్లు పట్టు పడుతున్నారు. అంతే కాకుండా ఈ జిరాక్సు కాపీలు ఎప్పటి లోగా ఇవ్వాలనే చివరి గడువు ఏదో కూడా ప్రకటించలేదు.
 
 ఆయా బ్యాంకుల వారు తమ వెసులుబాటు కోసం సోమవారమే ఆఖరురోజు అని ప్రచారం చేయడంతో జిల్లావ్యాప్తంగా అత్యధిక బ్యాంకుల బ్రాంచ్‌ల వద్ద రైతుల జాతర కనిపించింది.  జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులు 4,20,936 (ఖాతాలు) మంది ఉన్నారు.  బ్యాంకు వారీగా  రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను తయారు చేయడానికి బ్యాంకర్లు ైరైతులను జిరాక్సు కాపీలతో బ్యాంకులకు రావాలని కోరడంతో రద్దీ పెరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో  గ్రామసభలు నిర్వహించి  రైతురుణాల తుది జాబితాను ఖరారు చేయాల్సి ఉండడంతో రైతులు కూడా ఎగబడుతున్నారు.
 
 ఇక, ఆధార్ కార్డు జిరాక్సులు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో ఈ సమస్య వచ్చిపడింది. జిల్లాలో నూటికి నూరు శాతం ఆధార్ నమోదు పూర్తి కాలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 34,88,795 మంది జనాభా ఉన్నారు. అధికారిక వివరాల మేరకు ఇప్పటి వరకు జిల్లాలో 31,94,000 మందికి ఆధార్ జారీ చేశారు. ఇంకా, 2,94,795 మందికి ఆధార్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. కాగా, రుణమాఫీకి ఆధార్ కార్డును   లింకు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
  మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా రైతులంతా బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో భూమి వేరే పేరు మీద, ఆధార్ కార్డు వేరే పేరు మీద ఉండడంతో తీసుకునేందుకు నిరాకరించారు. చండూరులో ఆధార్‌కార్డు లేని రైతులు మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు. మునుగోడు మండలంలో ఆదర్శరైతులు రైతుల ఇళ్లకు వెళ్లి ఆధార్‌కార్డుల జిరాక్సులు సేకరిస్తున్నారు.
 
  దేవరకొండ నియోజకవర్గంలో రైతుల్లో హడావిడి నెలకొంది. ముఖ్యంగా ఆన్‌లైన్ లేని బ్యాంకులు రైతులకు ఈనెల 31లోగా ఆధార్ కార్డు ఇవ్వాలన్న నిబంధన విధించడంతో ఆధార్ ఇవ్వకపోతే ఎక్కడ రుణమాఫీ కోల్పోతామోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌కార్డులు దిగడానికి మండలానికి ఒక్క సెంటర్ మాత్రమే ఏర్పాటు చేయగా ఇచ్చిన గడువు సరిపోదని పేర్కొంటున్నారు. కాగా, ఆన్‌లైన్ సౌకర్యం ఉన్న కొన్ని బ్యాంకుల అధికారులు మాత్రం ఆధార్ తప్పనిసరి అనే ఆదేశాలు తమకు లేవని పేర్కొంటున్నారు.
 
  నకిరేకల్ నియోజకవర్గంలోని మండలాల్లో బ్యాంకుల వద్ద రైతుల  సందడి నెలకొంది. జిరాక్స్ ప్రతులను ఇచ్చేందుకు బారులుదీరారు. మరోవైపు జిరాక్స్ సెంటర్లు కూడా రైతులతో కిక్కిరిసిపోయాయి. చిట్యాల కెనరా బ్యాంకులో బ్యాంకు సెక్యూరిటీ రైతుల నుంచి జిరాక్స్ కాపీలు తీసుకున్నారు. కేతేపల్లి మండలంలో ఏపీజీవీబీ ఇరుకుగా ఉండడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. జిరాక్సు కాపీలు ఇచ్చేందుకు రైతులు రోజంతా బ్యాంకు వద్దే పడిగాపులు కాశారు.
 
  కోదాడ నియోజకవర్గంలో గడిచిన నాలుగు రోజులుగా రైతులు బ్యాంకులకు వెళుతున్నారు.  ఆన్‌లైన్ సౌకర్యం  లేని బ్యాంకులు వద్ద మాత్రం  రైతులు ఇవ్వడానికి క్యూ కట్టారు. కొందరు రైతులకు ఆధార్ కార్డులు లేక  ఏం చేయాలో తెలుసు కోవడానికి బ్యాంకులకు వస్తున్నారు. చాలా గ్రామాల్లో చాలా మంది ఆధార్ కార్డులు పొందకపోగా, బ్యాంకర్లు ఇచ్చిన గడువు ఈ నెల 31 వరకు మాత్రమే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోదాడ ఆంధ్రాబ్యాంక్ అధికారులు మాత్రం తాము అలాంటి నిబంధన ఏది విధించలేదని చెప్పారు. నడిగూడెం మండలం త్రిపురవరంలో ఆధార్‌కార్డులు  లేని రైతులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు.
 
  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బ్యాంకుల  వద్ద రైతుల సందడి నెలకొన్నది. రుణమాఫీ వర్తించే  రైతులు బ్యాంకుల  చుట్టూ ప్రద క్షిణ చేస్తున్నారు.  నియోజకవర్గంలో ఇప్పటికి నూటికి 80 శాతం మంది మాత్రమే ఆధార్‌కార్డు కలిగి ఉన్నారు. మిగిలిన 20 శాతం మందికి ఆధార్ కార్డులేదు.  ఆధార్‌కార్డులు దిగడానికి మండల కేంద్రాల్లో ఉన్న మీ సేవకేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా మీ సేవా నిర్వహకులు ఆధార్‌కార్డు నమోదు కోసం రూ.50, ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసినందుకు  50 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు.   
 
  మిర్యాలగూడ నియోజకవర్గంలో పంట రుణాలు తీసుకున్న రైతులు అయోమయంలో ఉన్నారు. కాగా ఒక కుటుంబానికి లక్ష రూపాయల రుణమాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంతో ఉమ్మడి కుటుంబంలో ఉంటూ వేర్వేరుగా పంట రుణాలు పొందిన రైతులు ఆందోళన చెందుతున్నారు.    హుజూర్‌నగర్  నియోజకవర్గం పరిధిలోని రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనా, రుణాల మాఫీకి ఆధార్‌కార్డులను అందజేసేందుకు పనులను నిలిపి వేసి బ్యాంకులకు తరలివస్తున్నారు.  ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్ వారు మాత్రం ఎటువంటి జీరాక్స్ కాపీలను  రైతుల నుంచితీసుకోవాలని ఆదేశాలు లేవని చెబుతున్నా  రైతులు మాత్రం ఆందోళనతో జిరాక్స్ కాపీలు తీసుకుని బ్యాంకులకు వస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement