
టీఆర్‌ఎస్ ఓ డ్రామా కంపెనీ: ఉత్తమ్
మట్టపల్లి(నల్లగొండ): ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇస్తానని ప్రకటన చేశారని టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అయితే, ఈ ఖరీఫ్ నుండే ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా కోసం ఏమీ చేయలేదు కాబట్టే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లను తెలంగాణలో చూడలేరని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను రాజకీయ దురుద్దేశంతోనే ఆపేశారని ఆరోపించారు. మిషన్ కాకతీయ, భగీరథ పేరుతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ఓ వైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం ఘనకార్యం చేశామని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మూడున్నర కోట్ల ప్రజల్లో కేవలం ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత కేసీఆర్ దే అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓ డ్రామా కంపెనీగా మారిందన్న ఆయన 2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అన్నారు. లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతిగా నిరుద్యోగులకు నెలకు రూ.3,000 అందజేమన్నారు. ఇందిరమ్మ గృహాలకు అదనంగా మరొక గదిని నిర్మించి పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.