సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు వెళ్తూ.. ముందు చూపుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను ఖరారు చేయగా... విపక్షాలు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. పొత్తులు, ఎత్తులతో విపక్ష పార్టీలు వ్యూహరచనల్లో మునిగి ఉంటే... అధికార పార్టీ అభ్యర్థులు మాత్రం జనంలోకి చొచ్చుకుపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా దాదాపుగా ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. మహాకూటమిగా ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, సీపీఐ పొత్తు ఇప్పట్లో పొడిచే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్, ఇతర పక్షాల అభ్యర్థులనుప్రకటించిన తరువాత వ్యూహాత్మకంగా కమలం అభ్యర్థులను రంగంలోకి దించాలని బీజేపీ చూస్తోంది. ఈ నెలాఖరు వరకు ఈ తతంగం కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్యక్షేత్రంలోకి దిగారు. వినాయక నిమజ్జనం తరువాత మరింత దూకుడుగా ముందుకు సాగాలని పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు.
భిన్న మార్గాల్లో మంత్రుల వ్యూహాలు
ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో మూడురోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో తిరుగుతూ మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వందలాది మంది కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి రామన్న చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కూడా బాగానే ఉంది.
మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యూహాత్మకంగా నిర్మల్‌లో పావులు కదుపుతున్నారు. ప్రచారానికి చాలా సమయం ఉందన్న ఉద్దేశంతో విపక్ష పార్టీల నుంచి ముఖ్య నాయకులుగా ఉన్న వారిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా మహేశ్వర్‌రెడ్డి బరిలో నిలవనుండడం, బీజేపీలో ఇటీవల చేరిన మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూతురు డాక్టర్ స్వర్ణారెడ్డి పోటీ చేయనుండడంతో ఆయన తనదైన శైలిలో ఆయా పార్టీలను బలహీనపరిచే దిశగా చర్యలు చేపట్టారు. మండలాల నుంచి చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తేలని కూటమి లెక్కలతో విపక్షాలు
కాంగ్రెస్, టీడీపీ, టీజేఎఫ్, సీపీఐ పార్టీలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కడ సీటు దక్కే అవకాశం ఉందో తెలియని స్థితి నెలకొంది. పదింట కనీసం రెండింటిని మిత్రపక్షాలకు వదిలేసే పరిస్థితి కాంగ్రెస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు సీటు కోసం ప్రయత్నాలు చేసే పనిలోనే పడ్డారు. కాగా సీటు ఖాయమన్న ధీమాతో ఉన్న నాయకులు మాత్రం తమదైన శైలిలో జనంలోకి వెళుతున్నారు. నిర్మల్‌లో సీటు ఖాయమైన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తన వర్గానికి సీట్లు ఇప్పించుకునే బిజీలో ఉన్నారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గత 15 రోజులుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సాగిస్తున్నారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందనే లభిస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన పాల్వాయి హరీష్‌రావు ఇప్పటికే సిర్పూరును చుట్టి వచ్చారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు తనకే టిక్కెట్టు ఖాయమన్న ధీమాతో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. మిగతా చోట్ల టికెట్ల పాట్లతో పాటు పొత్తుల్లో సీట్లు పోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నేతలున్నారు.
బీజేపీలో కొత్త నేతలను వ్యతిరేకిస్తున్న సీనియర్లు
ఉమ్మడి జిల్లాలో బోణీ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ గూటికి వచ్చిన వారందరినీ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో టికెట్లపై జరుగుతున్న ప్రచారాన్ని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంచిర్యాలలో పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డిని కాదని ఎన్నారైని ప్రోత్సహిస్తుండడాన్ని స్థానిక పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంచిర్యాలలో మల్లారెడ్డికే సీటు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది.
ఆసిఫాబాద్‌లో తాజా మాజీ సర్పంచి సరస్వతిని బీజేపీలోకి తీసుకొచ్చి టికెట్టు ఇవ్వాలని జరుగుతున్న ప్రయత్నాలపై సిర్పూరు(టి) జెడ్పీటీసీ అజ్మీరా రాంనాయక్ వర్గం భగ్గుమంది. ఆసిఫాబాద్‌లో రాంనాయక్‌కే టికెట్టు ఇవ్వాలని బీజేపీ నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు అధిష్టానానికి కూడా లేఖలు పంపారు. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడుతూ, ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాభిమానం చూరగొన్న నాయకులకు అన్యాయం చేయవద్దని పేర్కొన్నారు. ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుట్రలకు ఆస్కారం ఉండదని, తనకే ఆసిఫాబాద్ టిక్కెట్టు అని రాంనాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
ప్రచారానికి తాజా మాజీల శ్రీకారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంతో జనంలోకి వెళ్తున్నారు. మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుంచే ప్రచారంలో మునిగిపోయారు. మంచిర్యాల పట్టణంతో పాటు దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని గ్రామాల్లో ప్రతిరోజు పర్యటిస్తున్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య కాసిపేట, బెల్లంపల్లిలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. చెన్నూరులో అభ్యర్థిగా ఖరారైన పెద్దపల్లి ఎంపీ వారం క్రితమే భారీ ర్యాలీతో ప్రచారం ప్రారంభించారు. అయితే టికెట్టు కోల్పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యాయత్నం, తర్వాత అతడి మృతి కొంత ఇబ్బందిని కలిగించింది.
గత సోమవారం గద్దెరాగడిలో సొంతిల్లు నిర్మాణానికి భూమిని కొనుగోలు చేసేందుకు వచ్చిన సుమన్ 22వ తేదీ నుంచి ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. సిర్పూరులో కోనేరు కోనప్ప రోజుకో మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మందీ మార్బలంతో ఆయన చేస్తున్న ప్రచారం గిరిజన గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతోంది. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముధోల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేరికలకు ప్రాధాన్యతనిస్తున్నారు. బోథ్‌లో రాథోడ్ బాపూరావు, ఎంపీ జి.నగేష్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఖానాపూర్‌లో రేఖానాయక్ అసమ్మతిని ఎదురొడ్డి తనదైన శైలిలో ప్రజల ముందుకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment