నామినేటెడ్ పదవులపై టీఆర్‌ఎస్ నేతల కన్ను | TRS leaders focus on the trs leaders | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ పదవులపై టీఆర్‌ఎస్ నేతల కన్ను

Published Thu, Jan 8 2015 4:10 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

నామినేటెడ్ పదవులపై టీఆర్‌ఎస్ నేతల కన్ను - Sakshi

నామినేటెడ్ పదవులపై టీఆర్‌ఎస్ నేతల కన్ను

* భద్రాచలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవికి భారీ పైరవీలు
* మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకూ తీవ్ర యత్నాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాకు ఒక మంత్రి పదవి, పార్లమెంటరీ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చోటు లభించింది. మరిన్ని పదవులను దక్కించుకోవడం కోసం ఆ పార్టీ ముఖ్యనేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

మొదటి నుంచి పార్టీ జెండాను మోసిన నేతలతో పాటు ఇటీవల ఆ పార్టీలో చేరిన నాయకులు కూడా నామినేటెడ్ పదవులపై గంపెడాశలతో ఉన్నారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో కీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న దృష్ట్యా తమకు అవకాశం కల్పిస్తారనే ఆశతో పలువురు నేతలు ఉన్నారు. రాష్ట్రస్థాయిలో ఒకటి లేదా రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభిస్తాయనే నమ్మకంతో సీనియర్ నేతలు పైరవీలు మొదలుపెట్టారు.
 
మంత్రుల ప్రసన్నం కోసం తహతహ
జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావుల ఆశీస్సుల కోసం పలువురు నేతలు తహతహలాడుతున్నారు. జిల్లాలో కీలకమైన భద్రాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవిపై ఎక్కువ మంది నేతల దృష్టి ఉంది. జిల్లాకు చెందిన ప్రధాన, ద్వితీయశ్రేణి నేతలు ఈ పదవి కోసం వెంపర్లాడుతున్నారు. ఎవరికి వారిగా తమకంటే తమకు పదవి వస్తుందని ఊహాగానాలు సాగిస్తున్నారు.

పార్టీకి చేసిన సేవ, ఉద్యమంలో పోషించిన పాత్ర, ముఖ్యనేతలతో పరిచయం..ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. తమకున్న సానుకూలాంశాలను తుమ్మల, జలగంల దృష్టికి తీసుకెళ్లే పనిలో మరికొందరున్నారు. ఆధ్యాత్మికంగా భద్రాచలానికి ఉన్న ప్రాధాన్యం, శ్రీరామనవమి, జూలైలో గోదావరి పుష్కరాలు..వీటికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, వీటి నిర్వహణకు కోట్ల నిధులు విడుదల చేసే అవకాశం ఉండటంతో ప్రధాన నేతల అందరి దృష్టి భద్రాద్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిపైనే పడింది.

టీడీపీ హయాంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, భద్రాచలం ప్రాంతానికి చెందిన మాజీ అధ్యాపకులు సిద్ధులు, న్యాయవాది ఎం.వి.రమణారావు, ఖమ్మం నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ, పార్టీ సీనియర్ నేత నూకల నరేష్‌రెడ్డితోపాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి వైరా, సత్తుపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాణోత్ చంద్రావతి, పిడమర్తి రవికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. చంద్రావతికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చోటు లభించగా, రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

వీరిలో ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి ఇల్లెందు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బేగ్, పినపాక నియోజకవర్గం నుంచి పోటీచేసిన సింగరేణి వైద్యుడు డాక్టర్ శంకర్‌నాయక్‌కు సైతం రాష్ట్ర స్థాయిలో కీలకపదవి లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

పార్టీలో ఆదినుంచి కొనసాగుతూ..ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి నూకల నరేశ్‌రెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారని సమాచారం.
 
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపైనా దృష్టి
జిల్లాలో కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు సైతం పార్టీలో భారీ పోటీ నెలకొంది. ఒకవైపు ఉద్యమంలో పాల్గొన్న నేతలు, మరోవైపు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఈ పదవులను ఆశిస్తుండటంతో ఎవరికి కేటాయించాలో అర్థంకాని స్థితి పార్టీ నాయకత్వానికి ఉంది.

టీఆర్‌ఎస్‌లో చేరే ముందు కొందరు నేతలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తామన్న హామీ సైతం లభించినట్లు ప్రచారం జరగడంతో వారు కాస్త నమ్మకంతో ఉన్నారు. ఇందులో కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఆశావహుల జాబితా అధికంగానే ఉంది. ఈ కమిటీ చైర్మన్ పదవిని మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కుమారుడు కట్టా అజయ్‌కుమార్‌తోపాటు కల్లూరుకు చెందిన కొండపల్లి వాసు, మాజీ ఎంపీపీ అత్తునూరి రంగారెడ్డి తదితరులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేసులో వేంసూరు మండలం కందుకూరుకు చెందిన బండి అంజిరెడ్డి, సత్తుపల్లికి చెందిన చల్లగుండ్ల నరసింహారావు, మాజీ జెడ్పీటీసీ గాదె సత్యం పేర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలు సైతం ప్రయత్నిస్తున్నా తమకు ఏ పదవి ఇవ్వాలన్నది పార్టీ నాయకులు చూసుకుంటారని గుంభనంగా ఉంటున్నారు. వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సైతం ఇదే స్థాయిలో పోటీ ఉంది.

వైరా శాసనసభ్యుడు బాణోత్ మదన్‌లాల్ సూచించిన వారికే ఈ చైర్మన్ పదవి లభించే అవకాశం ఉంది. ఇక పోతే మధిర, నేలకొండపల్లి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీకాలం పూర్తి కాలేదన్న కారణంతో అక్కడి చైర్మన్‌లు కోర్టు ఆదేశాల మేరకు ఆయా పదవుల్లో కొనసాగుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల వంటి ఏజెన్సీ ప్రాంతాల మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లను నియమించలేదు.

అక్కడ గిరిజనులకు మాత్రమే చైర్మన్‌లుగా అవకాశం ఇవ్వాలని కొందరు కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘకాలంగా ఆయా ప్రాంతాల్లో మార్కెట్ కమిటీలకు చైర్మన్‌ల నియామకం ఆగిపోయింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని భర్తీ చేయడం ఆ పార్టీకి అత్యంత క్లిష్టతరం కానుంది.

ఈ పదవిని ఖమ్మం నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన ఆర్‌జేసీ కృష్ణతోపాటు ఈశ్వరప్రగడ హరిబాబు, బోడేపూడి రమేష్‌బాబు, టీఆర్‌ఎస్ లీగల్‌సెల్‌కు చెందిన గుండ్లపల్లి శేషగిరిరావు, వ్యాపార, వాణిజ్యరంగాలకు చెందిన కీలకనేతలు, టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలున్న జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పలు దేవస్థానాల చైర్మన్‌లకు సైతం ఇదే స్థాయిలో పోటీ నెలకొంది.
 
జిల్లాలో నామినేటెడ్ పదవులు ఇవే..
జిల్లాలో 13  వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటిలో  ఖమ్మం , నేలకొండపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, ఏన్కూరు, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, వైరా, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, మధిర  ఉన్నాయి. వీటికి చైర్మన్‌లతో పాటు వైస్ చైర్మన్లుగా 13 మంది, మొత్తం పాలక వర్గసభ్యులు 156 మందిని నియమించుకోవచ్చు.
 
విద్యా కమిటీలు
- ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో .. - 3,215 కమిటీలు
- ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో..  - 374
- ఒక్కో కమిటీకి ఒక్కొక్కరి చొప్పున మొత్తం    - 3589  మందిని చైర్మన్లుగా (సర్పంచ్‌లు) నియమిస్తారు.  ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాల కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ ఉంటారు.
 
గ్రంథాలయాలు ..
- జిల్లా గ్రంథాలయ చైర్మన్ - 1
- జిల్లా గ్రంథాలయ పాలక మండలి సభ్యులు      -  5
- శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్లు       -  52
 
దేవాలయాలు..
- దేవాలయాలను 6ఏ, 6బీ, 6సీ అని మూడు రకాలుగా విభజించారు.
- 6ఏలో మూడు దేవాలయాలు -  ముగ్గురు చైర్మన్లు         24 మంది బోర్డు సభ్యులు
- 6బీలో 25 దేవాలయాలు   -    25 మంది చైర్మన్లు         100 మంది సభ్యులు
- 6సీలో 595 దేవాలయాలు  -  595 మంది చైర్మన్లు       1190 మంది సభ్యులు
- మొత్తం - 623 మంది చైర్మన్లు       1314 మంది సభ్యులను నియమిస్తారు.
- ఫుడ్ అడ్వైజరీ కమిటీలు     - 46
- కన్వీనర్లుగా - 46 మందిని (జడ్పీటీసీలు ) నియమిస్తారు
- జిల్లా స్థాయిలో  కో- కన్వీనర్   - 1 ( కో - కన్వీనర్‌గా జడ్పీ చైర్‌పర్సన్ ఉంటారు)
- ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు.
 
అసైన్‌మెంట్ కమిటీలు
జిల్లాలో అసైన్‌మెంట్ కమిటీలు - 10 ( ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు)     
- నియోజకవర్గ ఎమ్మెల్యే అసైన్‌మెంట్  కమిటీ చైర్మన్‌గా నియమితులవుతారు.
- 10 మంది చైర్మన్లుగా ఉంటారు ( జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి)
- 40 మంది సభ్యులు ( ఒక్కో కమిటీలో నలుగురు సభ్యులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి నియమిస్తారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement