‘మార్కెట్’ లొల్లి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌లో ‘మార్కెట్’ లొల్లి షురూ అవుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలకు, ఇటీవల ఎన్నికలు, ఆ తర్వాత పార్టీలో చేరిన నాయకులకు మధ్య పోరు రగులుతోంది. ఈ రెండు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఈ రెండు వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఈ పదవులను తమ అనుచరులకు ఇప్పించుకుని పార్టీలో, నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఇరువర్గాల ముఖ్యనేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా తయారైంది.
ఎన్నికలకు ముందు రాష్ట్రపతి పాలన నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో నియమించిన మార్కెట్ కమిటీలు రద్దయ్యాయి. మంత్రివర్గ విస్తరణ అనంతరం కేసీఆర్ సర్కారు నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించే అవకాశాలున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదేళ్లుగా ఉద్యమం చేస్తూ.. పార్టీ పటిష్టత కోసం పాటుపడిన నేతలను కాదని ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు పదవులు ఎలా కట్టబెడతారని ఒక వర్గం నేతలు పేర్కొంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
* నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల కోసం నియోజకవర్గంలో ఆసక్తి కరమైన పోరు సాగుతోంది. పార్టీలో సీనియర్లుగా కొనసాగిన క్రియాశీలక నేతలు శ్రీహరీరావు వర్గం తరుఫున మార్కెట్ చైర్మన్ పదవులు ఆశిస్తుండగా, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి అనుచరులు కూడా పట్టుబడుతుండడం ఇరువురి నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే ఒకవర్గం నేతలు హరీష్‌రావును కలువగా, మరో వర్గం నేతలు కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
* బోథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీల విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎంపీ నగేష్ వర్గీయులకు, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వర్గీయులకు మధ్య పోటీ నెలకొంది. కొన్నేళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న రాథోడ్ వర్గీయులతోపాటు, ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ గోడం నగేష్ అనుచరులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
* భైంసా, కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ల పదవుల విషయంలో కూడా ఆసక్తి కరమైన పోటీ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వర్గీయులు, ఇటు టీఆర్‌ఎస్ అనుబంధ ఎమ్మెల్యే అన్నంత స్థాయిలో జి.విఠల్‌రెడ్డి అనుచరులు ఈ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవులు విఠల్‌రెడ్డి అనుచరులైన కాంగ్రెస్ నేతలకు దక్కుతాయా, చారీ వర్గీయులను వరిస్తాయా వేచిచూడాల్సిందే.
* మంచిర్యాల, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీలపై ఎమ్మెల్యే దివాకర్‌రావు అనుచరులతోపాటు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు దివాకర్‌రావుతోపాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పదవులు ఎవరికి దక్కుతాయోననే ఆసక్తి నెలకొంది.
* బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నేతల ప్రయత్నాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులతోపాటు, పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రేణికుంట్ల ప్రవీణ్ అనుచరులు కూడా ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.