కారు దిగిన లాలు.. టీఆర్‌ఎస్‌కు షాక్‌! | TRS Leaders Lalu Nayak Joining to Congress | Sakshi
Sakshi News home page

కారు దిగిన లాలు.. టీఆర్‌ఎస్‌కు షాక్‌!

Published Tue, Oct 30 2018 4:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS Leaders Lalu Nayak Joining to Congress - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : దేవరకొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమావత్‌ రవీంద్ర కుమార్‌కు ఇది ఊహించని ఎదురు దెబ్బే. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేసిన కేతావత్‌ లాలూనాయక్‌ కారు దిగారు. ఆయా పార్టీలనుంచి నాయకులు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరే దాకా ఇన్‌చార్జి బాధ్యతలు చూసిన లాలూనాయక్‌ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం గేట్లు ఎత్తింది. 

దీనిలో భాగంగానే కాంగ్రెస్‌ నుంచి జెడ్పీ చైర్మన్‌గా గెలిచిన బాలునాయక్‌ గులాబీ గూటికి చేరారు. దీంతో నియోజకవర్గంలో ఇక బలపడొచ్చని ఆ పార్టీ నాయకత్వం భావించింది. అటు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐనుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్‌ కూడా గులాబీ గూటికి చేరడంతో ఇక నియోజకవర్గంలో కారు వేగానికి ఢోకా ఉండదని భావించారు. కానీ.. గత నెల 6వ తేదీన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించాక పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

టికెట్‌ హామీతోనే పార్టీలో చేరిన బాలునాయక్‌ టికెట్లు ప్రకటించిన పది రోజుల్లోపే టీఆర్‌ఎస్‌ను వీడి సొంత గూటికి చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచర వర్గం, అంతకుముందు నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగిన ముఖ్య నేతలు సైతం కాంగ్రెస్‌ బాట పట్టారు. తాజాగా, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన లాలూనాయక్‌ సైతం సోమవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 38,618 (23.85శాతం) ఓట్లు వచ్చాయి. కానీ, ఈ ఓట్లు సాధించిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్‌కు మారారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్ర కుమార్‌ పరిస్థితి ఇరకాటంలో పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి..!
నాయకుల మార్పులు, చేర్పుల మాటెలా ఉన్నా.. ఆయా ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. మహాకూటమి బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ ఇప్పుడు మహాకూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్ధతుతో సీపీఐ ఇక్కడ పోటీచేసి 57,715 (35.69శాతం) ఓట్లు సంపాదించి విజయం సాధించింది. ఇదే ఎన్నికల్లో టీడీపీ 53,501 (33.04 శాతం) ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇపుడు ఈ మూడు పార్టీలూ కూటమిలో ఉన్నాయి. అంటే గత ఎన్నికల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. 1,11,213 ఓట్లు అవుతున్నాయి. 

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బిల్యా నాయక్‌ సైతం ఇపుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్‌కు అపుడు 67,887 ఓట్లు రాగా, టీడీపీ పొత్తుతో కూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ 57,419 ఓట్లు వచ్చాయి. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచిన రవీంద్ర కుమార్‌కు వ్యక్తిగత ఓటు బ్యాంకు ఎంత ఉంటుంది..? అది టీఆర్‌ఎస్‌లోకి మారాక ఎంత పెరిగి ఉంటుంది..? ఈ ఎన్నికల్లో ఎంత ఉపయోగపడుతుంది అన్న చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన 38,618 ఓట్లలో లాలూ నాయక్‌ వ్యక్తిగత ఓటు బ్యాంక్‌ ఎంత..? ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు మారడం వల్ల చీల్చుకుపోయే ఓట్లు ఎన్ని ఉండొచ్చన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ఇప్పటిదాకా ... రెండే పార్టీలు !
దేవరకొండ నియోజకవర్గం 1952 నుంచి 1972 దాకా ఐదు టర్మ్‌లు జనరల్‌ నియోజకవర్గంగా ఉంది. 1978 ఎన్నికలనుంచి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. మొత్తంగా 2014 వరకు ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక (2002) సహా (కాంగ్రెస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికై , స్థానం నిలబెట్టుకుంది) పదిహేను మార్లు ఎన్నికలు జరిగాయి. 1952 తొలి ఎన్నికల్లో పీడీఎఫ్‌ విజయం సాధించడం మినహా మిగిలిన పధ్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరు సార్లు (1957, 1967, 1978, 1983, 1999, 2009) సీపీఐ ఏడు సార్లు ( 1962, 1972, 1985, 1989, 1994, 2004, 2014) విజయం సాధించాయి.

సీపీఐతో పొత్తుల వల్ల  టీడీపీ ఇప్పటి వరకు మూడు సార్లే పోటీ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఏ ఎన్నికల్లోనైనా టీడీపీకి నలభై వేల ఓట్లకు తగ్గలేదు. 1999 ఎన్నికల్లో 45,907, 2004లో 44,561, 2014 ఎన్నికల్లో 53,501 ఓట్లు సాధించింది. మూడు పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకును ఎన్నికల ఫలితాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఈ మూడు పార్టీల ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసిందంటున్నారు.

స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో ఉన్న రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఈ పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయడానికి ఎలాంటి వ్యూహం రూపొందిస్తారు..? టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్ర కుమార్‌  ఈ అడ్డంకుల్ని అధిగమించి విజయతీరాన్ని ఎలా చేరుకుంటారు..? మహా కూటమి నుంచి ఎవరు అభ్యర్థి అవుతారు..? ఆ పార్టీల నడుమ ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా.. అన్న అనేక ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. 

కాంగ్రెస్‌లోకి..లాలు
కొండమల్లేపల్లి  : దేవరకొండ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జ్‌ లాలూనాయక్‌ సోమవారం సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గాన్ని, గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని పేర్కొన్నారు.  ఆయన వెంట జెడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలునాయక్, కాంగ్రెస్‌ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జగన్‌లాలునాయక్, వడ్త్య రమేశ్‌నాయక్, కిషన్‌నాయక్‌ తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement