సాక్షి, కొత్తగూడెం: మానుకోట లోక్‌సభ బరిలో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోరిక బలరాంనాయక్‌ను పేరు ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ఉండడంతోపాటు తేజావత్ రామచంద్రు, రెడ్యానాయక్ కుమార్తె కవిత పోటీపడ్డారు. దీంతో ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికనే విషయమై కార్యకర్తల్లో ఎడతెరిపి లేని చర్చ సాగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్‌కు టికెట్ రాదని తేలిపోయింది. ఈ క్రమంలో కవిత, రామచంద్రు మధ్య నువ్వా.. నేనా.. అనే స్థాయిలో రేసు సాగింది. చివరకు రెడ్యానాయక్ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కవితకే టికెట్ దక్కింది. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరి అంచనాలు వారివే..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భద్రాచలం, ములుగు, పినపాక, ఇల్లెందు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. డోర్నకల్, మహబూబాబద్, నర్సంపేట సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ గెలిచింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో పినపాక, ఇల్లెందులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బాణోత్ హరిప్రియ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పడిపోయింది.
దీంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే గత ఎన్నికల్లో మానుకోట పరిధిలో ఎక్కువ చోట్ల కాంగ్రెస్‌ను ఆదరించిన ప్రజలు ఈసారి కూడా తమనే ఆదరిస్తారని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత కష్టపడితే ఈ సీటును దక్కించుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ పోటీ హోరాహోరీగానే ఉండనుంది. ప్రధాన ప్రత్యర్థులెవరో తేలిపోవడంతో ఇక ప్రచార పర్వం ఊపందుకోనుంది.
కాంగ్రెస్ పార్టీ మానుకోట లోక్‌సభ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నియమించగా, టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌లుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వ్యవహరిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం జాటోత్ హుస్సేన్ నాయక్‌ను తన అభ్యర్థిగా ప్రకటించింది. హుస్సేన్‌నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి 12 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక సీపీఐ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. శనివారం హైదరాబాద్‌లో సీపీఐ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం అనంతరం ఆదివారం అభ్యర్థిని ప్రకటించనుంది.
మాలోత్ కవిత బయోడేటా...
పేరు : మాలోత్ కవిత
భర్త : భద్రునాయక్
జననం : 31–12–1979
విద్యార్హతలు : బీఎస్సీ కంప్యూటర్స్
జన్మస్థలం : ఉగ్గంపల్లి
ప్రత్యేకతలు : హిందీ, ఇంగ్లిష్, తెలుగు, లంబాడా భాషల్లో అనర్ఘళంగా మాట్లాడతారు.
తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ రాజకీయ గురువు. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014లో మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
2014లో టీఆర్‌ఎస్‌లో చేరిక. కొద్ది రోజుల్లోనే పార్టీలో చురుకైన పాత్ర పోషించారు.
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం నిజాయితీగా పనిచేసి సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
తండ్రి రెడ్యానాయక్‌ది డోర్నకల్, తనది మహబూబాబాద్, తన భర్తది ఇల్లెందు నియోజకవర్గం కావడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు కవితకు లోకల్‌గానే కలిసి వచ్చే అవకాశం.
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిని కలుపుకపోయే మనస్తత్వం.
Comments
Please login to add a commentAdd a comment