లండన్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి
* విద్య, వైద్యం, టెక్నాలజీ, ఇండస్ట్రీకి ప్రాధాన్యం
* అదే నమూనాలో రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ కృషి
* లండన్ పర్యటనతో కొత్త అంశాలు నేర్చుకున్నాను
* ‘సాక్షి’తో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత
రాయికల్ : ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా పేరొందిన లండన్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని, ఆ నగర స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఈ నెల 2నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరఫున దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 మంది ఎంపీలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి కవితకు అవకాశం దక్కింది.
సెమినార్ ముగించుకుని స్వరాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అక్కడి అనుభవాలను ఆమె శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘ఈ సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి యువ ఎంపీలు హాజరయ్యారు. 14 మందిలో ఇద్దరం మహిళా ఎంపీలం ఉన్నాం. సెమినార్‌లో ముఖ్యంగా దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన సంస్కరణలు, అక్షరాస్యత పెరుగుదల, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, హక్కుల సాధన, ఆర్థిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వంటి సంస్కరణలపై చర్చ జరిగింది.
భారత ఎంపీలం అందరం ఒకేచోట కలవడంతో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నాం. లండన్‌లో టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రీపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం ద్వారా అనూహ్యమైన ప్రగతిని సాధించినట్టు గమనించాను. అదేరీతిలో మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడమే నాన్న (కేసీఆర్) గారి మొదటి ఆశయం. ఇందుకు నా పర్యటనలో గమనించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.
ఇక లండన్‌లో తెలంగాణ ప్రవాసులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరాను. పెట్టుబడిదారులకు సర్కారు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించగా, మంచి స్పందన కనిపించింది. త్వరలోనే పెట్టుబడులు వస్తాయనే నమ్మకముంది. తెలంగాణ ఉద్యమం లండన్‌లోనూ విస్తరించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే అక్కడ టీఆర్‌ఎస్ ఎన్నారెసైల్, తెలంగాణ జాగృతి, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. నేను లండన్‌లో అడుగుపెట్టగానే వీరంతా ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో వందరోజుల పాలనపై ఏకంగా ఒక పుస్తకాన్నే రూపొందించారు. దానిని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది’’ అని కవిత తన పర్యటన విశేషాలను కుప్లంగా వివరించారు.